Jul 11,2023 22:55

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ సంచులను వీలైనంత వరకు తగ్గించి గుడ్డ సంచులను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్‌, స్వచ్‌ పక్వాడాలో భాగంగా మంగళవారం హెచ్‌పిసిఎల్‌ (హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌) ఆధ్వర్యంలో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు గుడ్డ సంచులను కలెక్టర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన శైలిలో మార్పులు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు జిల్లాలో చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్‌ సంచులు, ఫ్లాస్టిక్‌ ఫైక్సీలు, బ్యానర్స్‌, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేదాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాటన్‌ బ్యాగులు పంపిణీ చేయడం వల్ల ప్రజల్లో ఇది ఎందుకు చేస్నున్నారనే ఆలోచన కలుగుతుందన్నారు. విజయవాడలో ఉండే కెనాల్స్‌ వంతెన దగ్గర ప్లాస్టిక్‌ రహిత అవగాహన బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్లాస్టిక్‌ వలన కలిగే అనర్థాలు, వాటి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ బోర్డులలో రాయడం జరిగిందన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని ప్రజలందరూ పర్యావరణ అనుకూల అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. అనంతరం రైవస్‌, ఏలూరు కాలువల ఇరువైపుల ప్లాస్టిక్‌ బ్యాగులు, కవర్స్‌, బాటిల్స్‌ కాలువల్లో వేయరాదని ప్రజలకు తెలిపే విధంగా పర్యావరణ పరిరక్షణ అవగాహన బోర్డులను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పిసిఎల్‌ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ జనల్‌ మేనేజర్‌ బెన్నీ థామస్‌, డిజియం రెబ్బా అంబేద్కర్‌, చీఫ్‌ మేనేజర్లు నక్కా విల్సన్‌, ఆదిత్య ఆనంద్‌, సీనియర్‌ మేనేజర్‌ బి.వి.విష్ణువర్థన్‌రెడ్డి, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.