ప్రజాశక్తి - ఆరిలోవ : ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దడం మనందరి లక్ష్యం కావాలని జివిఎంసి కమిషనర్ లకీëశ అన్నారు. ఆరిలోవలోని స్కిల్ డెవలెప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌డిఐ)లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై శనివారం హెచ్‌పిసిఎల్ ఆధ్వర్యాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు భారత క్రికెటర్ కెఎస్.భరత్ పాల్గొని ఎస్‌డిఐ ప్రారగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా తాము విభిన్న సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. భారత్ క్రికెటర్ కెఎస్.భరత్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం ఎంతో అవసరమన్నారు. హెచ్‌పిసిఎల్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను స్వాగతిస్తున్నానన్నారు. హెచ్‌పిసిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.రతన్ రాజ్ మాట్లాడుతూ, మార్పు ముందుగా మన నుంచే ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్‌పిసిఎల్ సిజిఎం కె.నగేష్ మాట్లాడుతూ, హెచ్‌పిసిఎల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల నివాస గృహ సముదాయాలలో పూర్తి స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తామన్నారు. అనంతరం ప్లాస్టిక్ రహిత వస్తువులను తయారుచేసి ప్రదర్శనకు ఉంచిన కుటీర పరిశ్రమ యజమానులకు ప్రశంస పత్రాలను అందజేశారు.










