ప్రజాశక్తి-గుంటూరు : ప్రపంచ మానవాళితోపాటు, ఇతర జీవాలకు, పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమే కృషిలో రేపటి తరానికి వారసులైన విద్యార్థులు, యువత ఉద్యమంగా ముందుకు రావాలని నగరపాలక సంస్థ పర్యావరణ ఇంజినీర్ డాక్టర్ జి.అనిల్‌కుమార్ కోరారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశంపై స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్‌షాప్‌ను గురువారం నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్ధాలు, పునరుత్పత్తి మేనేజ్మెంట్ అంశాలపై స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, ఐటిసి వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరపాలక సంస్థ విద్యాసంస్థలలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. 400 ఏళ్లపాటు భూమిలో కరగక 16 తరాలపై తీవ్ర ప్రభావం చూపించే ప్లాస్టిక్ వాడకాలకు ప్రత్యామ్నాయ ఉత్పాదక వస్తువుల వాడకాలపై ప్రజలు తప్పనిసరిగా శ్రద్ధ కనపరచాలన్నారు. 120 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్న కవర్లను పూర్తిగా నిషేధిస్తూ రీసైకిల్డ్ తిరిగి ఉపయోగించే వస్తువుల తయారీకి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ రిసోర్స్ పర్సన్ వి.జస్వంత్, ప్రిన్సిపల్ డాక్టర్ వి.ఆర్.జోత్స్నకుమారి, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ ఎ.అపర్ణ సీతారాం, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ బి.శ్రీదేవి, డాక్టర్ కె.అనూష పాల్గొన్నారు.










