ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శి నర్సింగరావు
ప్రజాశక్తి -ఆనందపురం : ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనకు వేములవలస సచివాలయ సిబ్బంది, విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛహిత సేవలో భాగంగా మహాత్మాగాంధీ పూల మార్కెట్ నుంచి గ్రామంలోకి ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి నర్సింగరావు మాట్లాడుతూ, ప్లాస్టిక్ కవర్లు వాడకం పూర్తిగా నిరోధించాలన్నారు. ప్లాస్టిక్ కవర్లుపై నిషేధం ఉన్నా కొంతమంది వినియోగిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై ఆటోపై మైక్ ద్వారా ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లెంక కొండమ్మ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.










