Nov 24,2022 21:39

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
         కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధంపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామని ఎంహెచ్‌ఒ డాక్టర్‌ మాలతి తెలిపారు. స్థానిక వన్‌టౌన్‌ పరిధిలోని ప్రధాన మార్కెట్లలో గురువారం ఎంహెచ్‌ఒ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్స్‌ నిషేధించామన్నారు. జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌ ఆదేశాల మేరకు ఫ్యాన్సీ, కిరాణా, పండ్లు, కూరగాయల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో 200 కేజీలు నిషేధిత ప్లాస్టిక్‌ సంచులు, వస్తువులు స్వాధీనం చేసుకుని, వ్యాపారులకు రూ.25 వేలు జరిమానా విధించామన్నారు. ఇకపై నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు, సచివాలయ, పారిశుధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.