ప్రజాశక్తి -ముంచింగిపుట్టు: మండల కేంద్రంలో శనివారం నిర్వహించే వారపుసంతలో ప్లాస్టిక్ వస్తువులు, నకిలీ వస్తువుల అమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సచివాలయం నుంచి వారపుసంత వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్‌పై ప్రభుత్వం నిషేధించిందని, ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కలిగి, దాన్ని దూరంగా పెట్టాలన్నారు. ఎన్నేళ్లయినా క్షయం కాని ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఉందని, అంతేకాక ప్లాస్టిక్ కవర్లను ఆవులు, గేదెలు, మేకలు తినడం వల్ల అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయన్నారు
మండల వైస్ ఎంపీపీ పాటుబోయి సత్యనారాయణ మాట్లాడుతూ వారపుసంతలో నాసికరం, నకిలీ వస్తువులను ఒడిశా నుంచి జోలాపుట్టు వ్యాపారులు తీసుకొచ్చి అత్యధికంగా విక్రయిస్తున్నారని, అధిక లాభాలకు ఆశపడి వారు గిరిజనుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్నారు. గతవారం లక్ష్మీపురం వారపుసంతలో మండల ఫుడ్ విజిలెన్స్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాలం చెల్లిన, నాణ్యతలేని, ప్రభుత్వ గుర్తింపు పొందని కంపెనీల వస్తువులను ప్రజల సమక్షంలో కాల్చి తగలబెట్టారు. అదే తరహాలో ముంచింగిపుట్టు వారపుసంతలోనూ నకిలీ, నాసిరకపు వస్తువులు తెస్తే వాటిపై అధికారులు దాడులు నిర్వహించి అరికట్టాలన్నారు.లేకుంటే ఫుడ్ విజిలెన్స్ బృందం ఆ పని చేయక తప్పదని హెచ్చరించారు. సచివాలయ కార్యదర్శి గోపి మాట్లాడుతూ, ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నందున దాన్ని వాడిన వినియోగదారులకు రూ.50, విక్రయించిన వ్యాపారులకు రూ.వెయ్యి జరిమానా ఉంటుందని, ఇప్పటికైనా ప్లాస్టిక్ వాడకం మానుకోవాలన్నారు. ర్యాలీలో సచివాలయ సిబ్బంది, విఆర్‌ఎ, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.










