
ప్రజాశక్తి-గుంటూరు : ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక బ్రాడీపేట 2/7లోని గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ సహకారంతో ప్రాథమిక పరీక్షలు, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రజారోగ్య వేదిక జిల్లా నాయకులు ఎల్.ఎస్ భారవి, వై.సుబ్బారావు తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లుగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు సదస్సులు, అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా గుంటూరులోని ప్రముఖ న్యూరో ఫిజీషియన్లతో పక్షవాతముపై అవగాహన, సందేహాలు నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని అన్నారు. పక్షవాతానికి సంబంధించిన ప్రాథమిక పరీక్షలు ఉచితంగా చేస్తారని, అనంతరం వైద్యులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని, ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజారోగ్య జిల్లా నాయకులు యన్.హనుమంతరావు, శశిధర్ పాల్గొన్నారు.