ప్రజాశక్తి -కొమరాడ : రోగ నిర్ధారణ పరీక్షలు పక్కాగా నిర్వహించి, ప్రజలు సీజనల్ రోగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునై జేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని చంద్రంపేటలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జ్వర లక్షణాలతో ఎవరైనా ఉన్నారా అని సిబ్బందిని ఆరా తీశారు. ఒపి రికార్డులో వివిధ అనారోగ్య సమస్యలతో శిబిరానికి వచ్చిన వారికి చేపట్టిన ఆరోగ్య తనిఖీలు, పరీక్షలు పరిశీలించారు. జ్వర నిర్ధారణ పరీక్షలకు ఉపయోగిస్తున్న కిట్లు, స్లైడ్‌లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు మాట్లాడుతూ గ్రామంలో జ్వరాలను గుర్తిస్తే లక్షణాలను అనుసరించి వెంటనే మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల్లో భాగంగా డ్రై డే కార్యక్రమాలు, స్ప్రేయింగ్ పూర్తి స్థాయిలో నిర్వహించి ప్రజలు రోగాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గర్భిణీల ఆరోగ్య తనిఖీల కార్డులను పరిశీలించి ప్రతినెలా నమోదు చేస్తున్న హీమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.సాహితీ, డెమో వై.యోగీశ్వరరెడ్డి, సూపర్ వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది ప్రమీల, అనూష, రామకృష్ణ, 104 సిబ్బంది జగదీష్, దుర్గారావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










