Nov 23,2022 23:53

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశం
ప్రజాశక్తి -రంపచోడవరం

అన్ని గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు పక్కగా నిర్వహించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌తో కలిసి ఐటిడిఎ పిఒలు, సబ్‌ కలెక్టర్లు, ఎంపీడీవోలు, నిర్మాణ, విద్యాశాఖ, సర్వే అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎక్కడబడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలో ప్రతిరోజు పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. వై.రామవరం, కొయ్యూరు మండలం మధ్యలోని పాఠశాలలను ఎప్పటికప్పుడు ఎంపీడీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. బడి ఈడు పిల్లల గురించి సర్వే జరుగుతుందన్నారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులందరికీ రిజిస్ట్రేషన్‌, జియో టాకింగ్‌ తప్పకుండా చేయాలన్నారు. జిల్లాలోని సెల్‌ ఫోన్‌ టవర్ల ఏర్పాటుపై ఆయన ఆరా తీశారు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్‌ భూములు ఏ విధంగా రీ సర్వే చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌, ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారులు సూరజ్‌ గనోరే, గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్లు శుభం బన్సల్‌, పర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఆశితోష్‌ శ్రీవాస్తవ, డిఆర్‌ఒ బి.దయానిధి, జిల్లా సర్వే అధికారి మోహనరావు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, ఏపీవో సిహెచ్‌.శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు, ఎంపీడీవో ఎన్టీఆర్‌ కుమార్‌ బాబు, గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.