ప్రజాశక్తి- మెళియాపుట్టి: ఓటర్ నమోదుపై దృష్టి సారించాలని జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్ ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయంలో బిఎల్‌ఒలతో బుధవారం సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరిరూ ఓటరు నమోదు అయ్యేలా చూడాలని అన్నారు. ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారందరికీ ఓటరు నమోదు చేర్పించాలన్నారు. ఈ సర్వేలో వాలంటీర్లు గాని, రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదన్నారు. ప్రతి బిఎల్‌ఒ వారి పరిధిలోని ఇంటింటినీ సందర్శించి ఆ ఇంటిలోని ఓటర్ల వివరాలు సేకరించాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కును నమోదు చేయాలన్నారు. ఓటర్లకు చెందిన మార్పులు, చేర్పులనూ పరిగణలోకి తీసుకోవాలన్నారు. కొత్త ఓటర్లు ఉంటే వాటిని నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఇంటి నెంబరు సరిచూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ పి.సరోజని, డిటి శంకరరావు పాల్గొన్నారు.
జలుమూరు: ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు చేపట్టనున్న ఓటర్ల నమోదు వివరాలు సేకరించినందుకు వాలంటీర్లను వినియోగించకుండా స్వయంగా బిఎల్‌ఒలే ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టాలని ఇఆర్‌ఒ జి.జయదేవి ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయంలో బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు.తహశీల్దార్ బి.సత్యం పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: గ్రామాల్లో ఈ నెల 21 నుంచి జరగనున్న ఓటరు జాబిత సర్వేకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు బిఎల్‌ఒలకు సహకరించాలని తహశీల్దార్ వాన ఈశ్వరమ్మ కోరారు. తహశీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమీక్షించారు. ఓటర్లను పూర్తిగా పరిశీలించి అందులో తప్పులు ఉంటే తమకు తెలియజేస్తే అవి సరిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, జెడ్‌పిటిసి దుబ్బ వెంకటరావు, పేడాడ వెంకటరావు, గడ్డవలస నాగభూషణరావు, టిడిపి నాయకులు వెలమల కామేశ్వరరావు, బోయిన రమేష్ పాల్గొన్నారు.
ఆమదాలవలస : ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న ఓటర్ల నమోదు సర్వే పక్కాగా నిర్వహించాలని ఆర్‌డిఒ బొడ్డేపల్లి శాంతి ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీ నాయకులు, ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ బిఎల్‌ఒలతో బుధవారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్లు ఎస్.గణపతిరావు, పి.వేణుగోపాలరావు, రమేష్‌కుమార్, రమణారావు, ఎన్నికల డిటి మురళీధర్ నాయక్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.










