ప్రజాశక్తి - కొత్తూరు, మెళియాపుట్టి: ఓటర్ల సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లాపరిషత్ సిఇఒ ఆర్.వెంకట్రామన్ అన్నారు. కొత్తూరు, మెళియాపుట్టి తహశీల్దార్ కార్యాలయాల్లో బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో తొలగింపు, జత చేయడానికి సంబంధించి ప్రతి దరఖాస్తుకు డాక్యుమెంటేషన్ పూర్తిస్థాయిలో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. సంతకాల్లేకుండా ఫారాలను అప్‌లోడ్ చేయొద్దని సూచించారు. వాలంటీర్లతో సర్వే చేస్తున్నారని మెళియాపుట్టి మండలం దీనబంధుపురం బిఎల్‌ఎ కర్రన్న ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి నివేదిక అందించాలని జెడ్‌పి సిఇఒ ఆదేశించారు. ఓటర్ల సర్వేలో వాలంటీర్లను అనుమతించరాదని స్పష్టం చేశారు. సర్వేకు వాలంటీర్లను వెంట తీసుకెళ్తే సంబంధిత బిఎల్‌ఒలను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఓటర్ల సర్వే చేసేటప్పుడు బిఎల్‌ఒలు బిఎల్‌ఎలకు సమాచారం అందించడం లేదని కలెక్టర్ దృష్టికి వచ్చిందన్నారు. ఒడిశా వ్యక్తులకు ఇక్కడ ఓటరు కార్డు నమోదై ఉంటే క్షుణ్ణంగా పరిశీలించి తొలగించాలన్నారు. పట్టుపురం బిఎల్‌ఒ పనిలో వెనుకబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారేడుకోట బిఎల్‌ఒ భుజంగరావు సమావేశానికి గైర్హాజరు కావడంతో షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. కొత్తూరు మండలంలో ఇప్పటివరకు 6,553 ఓటర్ల సర్వే జరిగిందన్నారు. కేవలం 32శాతమే అయిందని, వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో తహశీల్దార్ పి.సరోజని, డిప్యూటీ తహశీల్దార్ వెంకటరమణ, శైలజ, ఎన్నికల డిటి ఎ.శైలజ, ఊణ్ణ శంకరరావు, ఇఒపిఆర్‌డి ఆర్.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.










