ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే
ప్రజాశక్తి-రంపచోడవరం
ఏజెన్సీలోని ప్రభుత్వ, రైతులకు సంబంధించిన భూములకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా రీ సర్వే చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంకాలం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్‌స్పెక్టర్లు, మండల సర్వేయర్లతో ఐటిడిఎ పిఒ గనోరే, సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే కె.దేవేంద్రుడు జగనన్న భూ హక్కు భూరక్ష ప్రోగ్రామ్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు టార్గెట్ ప్రకారం ప్రతి గ్రామంలో రీ సర్వే చేయాలన్నారు. ఈ రీ సర్వే చేసిన భూములకు ఎక్కడికక్కడ హద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కొక్క మండలానికి టార్గెట్ ప్రకారం ఎన్ని గ్రామాల్లో సర్వే పూర్తయింది ఇంకా ఎన్ని గ్రామాలలో సర్వే చేయవలసి ఉన్నది ఆయన ఆరా తీశారు. ఒక్కొక్క మండలం పరిధిలోని గ్రామాలలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎంతమంది సర్వే టీమ్‌లు పనిచేస్తున్నవి, ఎన్ని సర్వే మిషన్లో పనిచేస్తున్నాయో తెలుసుకున్నారు. సర్వే చేసిన భూములన్నింటికి సంబంధిత రైతులకు సంతృప్తి పొందినది లేనిది నోటీసులు ఇచ్చి గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సర్వే చేసిన భూములన్నింటికీ ముందుగా వీఆర్వోల లాగేన్‌లో పొందుపరచాలన్నారు. మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్‌స్పెక్టర్లు రవి శంకర్, నాగభూషణం, బాబురావు, రాజశేఖర్, ఏడు మండలాలకు సంబంధించిన మండల సర్వేయర్లు పాల్గొన్నారు.










