ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూ సర్వేను పక్కా ప్రణాళికతో నిర్వహించాలని రీజనల్ డైరెక్టర్ జి.నాగరాజు అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సిడిఎంఎ) కోటేశ్వరరావు నిర్వహించిన భూ రీసర్వేపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్‌డిఎంఎ) జి.నాగరాజు, మునిసిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు, రెవెన్యూ అధికారి రూబేన్ దిబ్బా, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి పి. కనకారావు, ఆర్‌ఐలు, వార్డు సచివాలయాల అడ్మిన్, ప్లానింగ్, రెవెన్యూ సెక్రెటరీతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో గల వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అర్బన్ రీసర్వేలో భాగంగా పట్టణంలో జరుగుతున్న అర్బన్ రీ సర్వేను పరిశీలించడానికి వచ్చామన్నారు. ఇందులో భాగంగా గ్రౌండ్ ట్రూతింగ్ డాక్యుమెంటేషన్ తక్కువగా కలెక్ట్ చేస్తున్నారని, దీన్ని వేగవంతం చేసి ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రెవెన్యూ, పారిశుధ్య విభాగం అధికారులతో సమావేశమై పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులకు క్లాప్, యూజర్ ఫీజులను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని, కార్మికులచే ఇంటింటికి వ్యర్ధాలను సేకరించాలని, వర్షాలు పడుతున్న దష్ట్యా సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుధ్య నిర్వహణ చేయాలని ఆదేశించారు, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ ఇంటి, కొళాయి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ ఆదాయాన్ని మెరుగుపరచాలని, కొళాయి పన్ను వసూలు తక్కువగా ఉందని దీనిమీద ప్రత్యేక డ్రైవ్ పెట్టి పూర్తిస్థాయిలో వసూలు చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.










