ప్రజాశక్తి - ఏలూరు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 30వ తేదీన ప్రారంభమవుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి నోడల్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, వైద్య ఆరోగ్య సిబ్బందితో గురువారం ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహణ కోసం పక్కా ప్లానింగ్‌తో సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్ (ఎస్‌ఒఎస్) ప్రకారం ఎవరెవరికి కేటాయించిన విధులను వారు పక్కగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు మ్యాన్ పవర్ ప్లానింగ్ తయారు చేసుకోవాలని సూచించారు. హెల్త్ స్క్రీనింగ్ కోసం ఐదు విభాగాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. హెల్ప్ డెస్క్ రిజిస్ట్రేషన్ డాక్టర్ ఎలాట్‌మెంట్ కనెక్షన్ గదులు, ల్యాబ్ టెస్ట్, కంటి విభాగం, స్కానింగ్ తదితర కౌంటర్లతో పాటు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ, న్యూట్రిషన్ స్టాల్‌ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం స్థానిక హెచ్‌ఎస్‌హెచ్‌ఒతో సమన్వయం చేసుకోవాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పూర్తికాని మండలాల్లో శుక్రవారం సాయంత్రానికల్లా నూరు శాతం పూర్తి చేసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ యాప్ ఫోన్‌లో డౌన్‌లోడ్ అయింది లేనిదీ పరిశీలించి, యుహెచ్‌ఐడి కార్డ్‌లో లాగిన్ చేయించాలన్నారు. సర్వే అయినవారికి ఎంపిహెచ్‌ఎస్ ద్వారా కేసు ఇచ్చి సర్వే కాని వారికి ఎఎన్‌ఎం సిహెచ్‌ఒ అప్‌లోడ్ చేసి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా కేసు షీట్ డౌన్లోడ్ చేసి వీరు ఇరువురి మెయిన్ సూపర్‌వైజర్ వద్దకు పంపాలన్నారు. వారు కేస్ షీట్ పరిశీలించి సంబంధిత వైద్యుల వద్దకు పంపుతారని తెలిపారు. ఈ హెల్త్ స్క్రీనింగ్ క్యాంపునకు వచ్చేవారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వయోవృద్ధులకు, గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు త్వరితగతిన స్క్రీనింగ్ చేయాలన్నారు. శిబిరం వద్ద రెండు మూడు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని, ఆపదమిత్ర సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. శిబిరంలో నలుగురు వైద్యులు అందుబాటులో ఉంటారని, వారిలో ఇద్దరు జనరల్ మెడిసిన్, మరో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారన్నారు. కేంద్రానికి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్లకు ఉన్న సదుపాయాలను, ఇసిజి మీటర్, టెస్టింగ్ మీటర్లను వారికి చూపించాలని తెలిపారు. వైద్యులకు బ్లౌజులు మాస్కులు అందించడంతోపాటు వారికి విశ్రాంతి రూము, భోజనం ఏర్పాటు చేయాలన్నారు. టోకెన్ జనరేషన్‌లో సమయాన్ని కేటాయించే స్లాట్స్ నిర్దేశించాలన్నారు. ప్రతిశిబిరంలో మూడు నాలుగు కంప్యూటర్లు, ప్రింటర్‌తో సహా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవసరమైన పారిశుధ్య సిబ్బందిని నియమించుకోవాలని, ముఖ్యంగా మ్యాన్‌పవర్ ప్లానింగ్ చేసుకోవాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రిఫరల్ చేస్తే సంబంధిత నోడల్ అధికారి, ఎంపిడిఒ ఫాలోఅప్ చేసుకోవాలని తెలిపారు. తహశీల్దార్, ఎంపిడిఒలతో కూడిన బృందాలు ఎక్కడైతే ఆరోగ్య సురక్ష నిర్వహిస్తారో అక్కడకు ఒకరోజు ముందుగానే వెళ్లి చెక్‌లిస్ట్ ప్రకారం పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కావాలని, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో డిఎంహెచ్‌ఒ శర్మిష్ట, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, కంటి విభాగం అధిపతి డాక్టర్ మల్లికార్జునరావు, అదనపు డిఎంహెచ్‌ఒ రాజీవ్, డిఐఒ నాగేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ పాల్గొన్నారు.










