Oct 06,2023 22:02

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి

ప్రజాశక్తి-బొబ్బిలి :  టిడిపి అధినేత చంద్రబాబును పక్కా ఆధారాలతో సిఐడి అధికారులు అరెస్టు చేశారని వైసిపి ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. స్థానిక సూర్య రెసిడెన్సీలో శుక్రవారం 'ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి' కార్యక్రమంపై నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్టన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి చేశారని, టిడిపి ఖాతాకు రూ.27 కోట్లు జమయ్యాయని ఆరోపించారు. న్యాయస్థానంలో చంద్రబాబుకు తప్పనిసరిగా శిక్ష పడుతుందని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి సచివాలయం వద్ద సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు జాబితాను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రచారం చేయాలన్నారు. జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పారాది వంతెనను గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. గతంలో చేసిన పనులను చెప్పగలరా? అని రాజులను ప్రశ్నించారు. విభేదాలు, సమస్యలను పక్కన పెట్టి వైసిపి గెలుపు కోసం పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు మాట్లాడుతూ రాజులకు మద్దతుగా బ్రోకర్‌ బ్యాచ్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మెట్టవలసలో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఫ్లెక్సీ చించివేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. టిడిపి నేత బేబినాయన చౌకబారు ఆరోపణలు అన్యాయమని, పారాది వంతెనను రాజకీ యంగా వాడుకోవడం సరికాదని హితవుపలికారు. పారాది, సీతానగరం వంతెనలకు నిధులు మంజూరు చేయకున్నా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయడం సిగ్గుచేటన్నారు. నూతన వంతెన పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ మాజీ సభ్యులు తూముల భాస్కరరావు, నియోజకవర్గ పరిశీలకులు రాజేశ్వరరావు, బుడా చైర్‌పర్సన్‌ ఇంటి పార్వతి, మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, ఎంపిపిలు శంబంగి లక్ష్మి, భోగి గౌరి, చొక్కాపు లక్ష్మణరావు, నర్సుపల్లి ఉమాలక్ష్మి, జెసిఎస్‌ కన్వీనర్లు విస్సు, టి.దామోదర్‌, ఎం.శంకరరావు పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణుల సమస్యలపై వినతి
విశ్వబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని పిసిసి సభ్యులు మువ్వల శ్రీనివాసరావు, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ముగడ వెంకటరమణ.. వైవి సుబ్బారెడ్డి, మజ్జి శ్రీనివాసరావుకు వినతులు అందజేశారు. 50 ఏళ్లు దాటిన విశ్వబ్రాహ్మణులకు పింఛను, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.
పారాది వంతెన పరిశీలన
బొబ్బిలిరూరల్‌ : పా
రాది వంతెనను వైసిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పరిశీలించారు. వైసిపి విస్తృత స్థాయి సమావేశానికి బొబ్బిలి వస్తున్న సందర్భంగా వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంతెన సమస్యపై సిఎం జగన్మోహన్‌ రెడ్డితో చర్చించి, పరిష్కారానికి కృషి చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. పాత వంతెన బాగు చేసి నూతన వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.