Aug 19,2023 00:34

పకడో... పకడో..!'ఆపరేషన్‌ బంటి' షురూ..!
శ్రీవారిమెట్టు ఏడోమైలు వద్ద సిసికెమెరాల్లో రికార్డు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
ఇపుడు కొండపై చిరుతతో పాటు, ఎలుగుబంటి సంచారమూ భక్తులకు భయాందోళనకు గురిచేస్తోంది. ఓ వైపు 'ఆపరేషన్‌ చిరుత' కొనసాగుతూ మూడు బోనుల్లో చిక్కాయి. భక్తులకు భద్రత కల్పిస్తూనే 'ఆపరేషన్‌ చిరుత' కొనసాగుతుందని టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉండగా శ్రీవారి మెట్టు మార్గంలో ఏడో మైలు వద్ద తరచూ ఎలుగువంటి సంచరించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. 'పట్టుకోండి చూద్దాం... పకడో... పకడో..' అంటూ ఎలుగుబంటి నిత్యం నడకదారిలో భక్తుల సెల్‌ఫోన్ల చిత్రాలకూ చిక్కుతోంది. దీంతో 'ఆపరేషన్‌ బంటి'ని టిటిడి ఉన్నతాధికారులు ప్రారంభించారు. నడకదారిలో ఎక్కడా తినుబండారాలను జంతువులకు పెట్టవద్దని, షాపుల వారు సైతం అంగళ్ల వద్ద వ్యర్థాలను వేయరాదని భక్తులను అప్రమత్తం చేస్తున్నారు.
అలిపిరి నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు అనేక సందర్భాల్లో ఎలుగుబంటి తారసపడింది. నిత్యం తిరుపతి నుంచి అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో భక్తులు, వ్యాపారులు నడచి తిరుమలకు చేరుకుంటుంటారు. సాధారణ రోజుల్లో కాలినడకన వెళ్లే భక్తుల సంఖ్య 20-25వేలు ఉంటుంది. వారాంతంలో 30-35వేలు ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో కాలినడకన కొండకు చేరుకునే భక్తుల సంఖ్య 40వేలు దాటుతుంది. ఇటీవల కాలంలో నడచి వెళ్లే మార్గంలో వన్యమృగాల సంచారం మరింత ఎక్కువయ్యింది. ఓ వైపు చిరుతలు భయపెడుతుంటే, మరోవైపు ఎలుగువంటి సంచారం ఆందోళన కలిగిస్తోంది. శ్రీవారి మెట్టు ఏడో మైలు ప్రాంతంలో తరచూ ఎలుగువంటి సంచరించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. భక్తులు చాలాసార్లు ఎలుగువంటి కనిపించిన విషయాన్ని టిటిడి సిబ్బంది దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది భక్తులు మొబైల్‌ ఫోన్‌లోనూ ఎలుగువంటిని ఫొటోలు తీశారు. భక్తులు అందించిన సమాచారంతో టిటిడి 'ఆపరేషన్‌ బంటి' కార్యక్రమం చేపట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఇందుకోసం 25 మంది సిబ్బందిని ఇప్పటికే నడకదారిలో ఏర్పాటు చేసింది. ఎలుగువంటిని బంధించేందుకు ప్రత్యేక బోన్లు, వలలతో ఆపరేషన్‌ మొదలు పెట్టింది. రెండుసార్లు వలలకు చిక్కినట్లే చిక్కి ఎలుగుబంటి తప్పించుకుంది. 'పట్టుకోండి చూద్దాం' అంటూ బంటి ముప్పతిప్పలు పెడుతోంది. ఎక్కడైతే బంటిని బంధించేందుకు ఏర్పాట్లు చేశారో అక్కడే ధైర్యంగా తిరుగుతోంది. భక్తులను ఎప్పటికప్పుడు టిటిడి అధికారులు అప్రమత్తం చేస్తూనే, బంటిని బంధించేందుకు మరో బృందాన్ని రంగంలోకి దించుతోంది. శ్రీవారి భక్తుల్లో భయాన్ని నింపిన ఎలుగుబంటి ఎప్పుడు చిక్కుతుందో చూడాలి మరి.
ఆహార వ్యర్థాలు నడకదారిలో వేయొద్దు : టిటిడి
భక్తులకు టిటిడి కొన్ని సూచనలు చేసింది. నడకదారిలో సాధుజంతువులకు ఎలాంటి ఆహారం ఇవ్వొద్దని టిటిడి హెచ్చరిస్తోంది. వ్యర్థ పదార్ధాలను షాపుల బయట వదిలేసేవారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చింది. భద్రత కోసం డ్రోన్లు వాడనుంది. 30 మీటర్ల దూరం కనబడేలా మెట్ల మార్గంలో ఫోకస్‌ లైట్లతో పాటు 500 ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. భక్తులను అప్రమత్తం చేసేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయనుంది. అలిపిరి, గాలిగోపురం, ఏడో మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి భద్రతపై భక్తులకు అవగాహన కల్పించనున్నారు.