Nov 14,2023 21:26

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌

        పుట్టపర్తి అర్బన్‌ : వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో వినియోగదారుల రక్షణ చట్టం అమలుపై సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వినియోగదారుల రక్షణ చట్టం అమలవుతున్న తీరుపై సంబంధిత శాఖ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ వినియోగదారులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన వినియోగదారుల రక్షణ చట్టంపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లోపభూయిష్ట వస్తువులు, అసంతప్తికరమైన సేవలు, మోసపూరితమైన వాణిజ్య పద్ధతులు వంటి వివిధ రకాల దోపిడీకి వ్యతిరేకంగా వినియోగదారులకు సమర్థవంతమైన భద్రతలను అందించడం వినియోగదారుల రక్షణ చట్టం ప్రధాన లక్ష్యం అన్నారు. వినియోగదారుల రక్షణ మండలి ఆధ్వర్యంలో వినియోగదారులకు మరిన్ని హక్కులు కల్పించడం వాటికి తగినంత ప్రాచుర్యం కల్పించడం కోసం విస్తతంగా చట్టంపై ప్రజలను అవగాహన చేసేందుకు చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కొత్త చట్టం ద్వారా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లను మరింత శక్తివంతంగా చేయడంతో పాటు వాటి పరిష్కారానికి కమిషన్‌లను ఆశ్రయించి సత్వర పరిష్కారం పొందే అవకాశం ఉంటుందన్నారు. లోక్‌ఆదాల తరహా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు. వినియోగదారులు ఫిర్యాదు చేయాలనుకుంటే తప్పనిసరిగా బిల్లు పొంది ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో వినియోగదారుల రక్షణ మండల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇందులో స్వచ్ఛంద సేవా సంస్థలు చురుకైన పాత్ర వహించాలని సూచించారు. ఈ సందర్భంగా వినియోగదారుల రక్షణ మండలిలోని స్వచ్ఛంద సేవా సంస్థలు ఇతర ప్రతినిధులు తమకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ జిల్లా పౌరసరఫరాల అధికారి ద్వారా చర్యలు చేపట్టి గుర్తింపు కార్డులో మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకష్ణ, డిఎంహెచ్‌ఒ డా||ఎస్‌వి.కృష్ణారెడ్డి, జిల్లా కొలతలు తూనిక శాఖ అధికారి గౌస్‌, ఫుడ్‌ సేఫ్టీ శాఖ శ్రీధర్‌, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ మధుసూదన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు పాల్గొన్నారు.