Sep 17,2023 22:33

పకడ్బందీగా సిఎం పర్యటన ఏర్పాట్లు
అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయండి : కలెక్టర్‌
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 18,19 తేదీన తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు -2023 సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని అనంతరం తిరుపతిలో పలు అభివద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఈనేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కె.వెంకట రమణరెడ్డి ఆదివారం సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీనివాస సేతు, గంగమ్మ తల్లి గుడి వద్ద వివిధ శాఖల భద్రతా ఏర్పాట్లను నగరపాలక కమిషనర్‌ హరితతో కలిసి కలెక్టర్‌ పరిశీలించి అధికారులు చేపట్టాల్సిన విధులపై పలు సూచనలు చేశారు. శ్రీనివాససేతు ప్రారంభోత్సవం, ఎస్‌వి ఆర్ట్స్‌ కళాశాల నూతన హాస్టల్‌ భవనాల ప్రారంభ శిలాఫలకం ఆవిష్కరణ, టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్టేజీ ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. అలాగే ఫైర్‌ అధికారులు ఫైర్‌ సేఫ్టీ చర్యలు, లైవ్‌ ఏర్పాట్లు, విద్యుత్‌ నిరంతరాయంగా ఉండాలని, తగినన్ని జనరేటర్ల ఏర్పాటు చేయాలని, బ్యారికేడింగ్‌ సరిపడా ఏర్పాటు చేయాలన్నారు. భద్రత ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎలాంటి చిన్న పొరపాటుకు తావివ్వకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎస్‌ఈ, ఏపీ ఎస్పిడిసిఎల్‌ కష్ణారెడ్డి, జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, మునిసిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, గంగమ్మ గుడి చైర్మన్‌ గోపి యాదవ్‌, టెంపుల్‌ ఈఓ ముని కష్ణయ్య, సెట్విన్‌ సీఈఓ మురళి కష్ణ పాల్గొన్నారు.