
ప్రజాశక్తి-చిలమత్తూరు :ఓటరు వెరిఫికేషన్‌ను బిఎల్‌ఒల ద్వారా పకడ్బందీగా చేపట్టాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, జాయింట్ కలెక్టర్ చేతన్ తహశీల్దార్ నాగరాజును ఆదేశించారు. జెసి గురువారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పి హెచ్‌ఎస్, ఉర్దూ పాఠశాల, సోమఘట్ట జడ్పి హెచ్‌ఎస్, చాగలేరు ఎంపియుపి పాఠశాలల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. స్పెషల్ సమ్మర్ రివిజన్-2024లో భాగంగా ఓటరు రీ సర్వే చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ నియమాలకు లోబడి ఉంచుకోవాలని సూచించారు. ఓటరు వెరిఫికేషన్‌లో భాగంగా వచ్చిన ఫారం-6, 7, 8లను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన కేంద్రాలను సిద్ధం చేసుకొని రేషనలైజేషన్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బిఎల్‌ఒలు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం చాగలేరు ఎంపియుపి పాఠశాలలో జెసి చేతన్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పిల్లలతో కలిసి అక్కడే భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని వడ్డించాలని నిర్వాహకులను ఆదేశించారు.