Sep 13,2023 23:20
రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌ లోని తన చాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా రూపొందించ నున్నామని కలెక్టర్‌ చెప్పారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాలుగా 1,03,377 దరఖాస్తులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో ఇంటింటి సర్వే కొనసాగుతోందని అన్నారు. నేటి వరకు మొత్తంగా 37,871 దరఖాస్తులు పరిష్కరించామని తెలిపారు. 4,260 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. మిగిలిన 55,982 దరఖాస్తులను విచారిస్తున్నామని తెలిపారు. తొలగింపు ఓట్లలో 251 దరఖాస్తులు సమగ్ర విచారణ జరగలేదని గుర్తించామన్నారు. అర్జీలు పెట్టిన వారినే పొరపాటుగా తొలగించారని, అందులో 48 దరఖాస్తులు అలాంటివేనని వివరించారు. ఈ పొరపాట్లను పున: పరిశీలనలో గుర్తించామన్నారు. ఓటర్ల విచారణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్‌ రంజిత్‌ బాషా చెప్పారు. గడచిన వారంలో నూతన ఓటు హక్కు కోసం 1,270 దరఖాస్తులు వచ్చాయని, తొలగింపుల కోసం 4,718 దరఖాస్తులు, మార్పులు చేర్పుల కోసం 46 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన 9,994 దరఖాస్తులను విచారణ చేస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల కోసం సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా రూపొందించే పనిలో ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు ఉన్నారని చెప్పారు. పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరు మండలంలో వచ్చిన ఆరోపణలపై జిల్లా సంయుక్త కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌ను విచారణ అధికారిగా నియమించామన్నారు. క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణకాంత్‌, టిడిపి నాయకులు షేక్‌ ఎండి గౌస్‌ బాషా, వైసిపి నాయకులు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.