ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం పకడ్బందీగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు వెల్లడించారు.వ ుంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మచిలీపట్నం నియోజకవర్గంలో తొలగించిన 18,235 ఓట్లకు సంబంధించిన 3 రకాల రికార్డులను, ఓటర్ నోటీసులు, పంచనామా పత్రాల్లో అధికారుల సంతకాలు క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో 1400 ఓటర్లకు మించకుండా ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి ఓటర్కు ఇంటి నెంబర్ ఉండాలని, ఏ ఇంటి నంబరు ఏ పోలింగ్ కేంద్రంలో వస్తుందో పక్కాగా సమాచారం వుండాలని సూచించారు. నియోజక వర్గంలోని 201 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి వాటి స్థితిగతులను పరిశీలించాలని సరిగా లేనిచో పోలింగ్ కేంద్రం మార్పు చేయుటకు ప్రతిపాదనలు పంపాలన్నారు.మచిలీపట్నం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు, శాశ్వత సరిహద్దులు వివరించే రేఖా చిత్రాన్ని కంప్యూటర్లో జిల్లా కలెక్టర్ పరిశీలించారు.భారత ఎన్నికల సంఘం ఆదేశాల అనుసరించి ఓటర్ల జాబితాలో మూడు రకాలు అనగా మతి చెందిన, శాశ్వతంగా వలస పోయిన, ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు సంబంధించి తొలగించిన ఓటర్ల రికార్డులను పరిశీలించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ హఠాత్తుగా ఎవరి ఓటును తొలగించడం గాని, చేర్చడం గానీ జరగదన్నారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రక్రియను తప్పనిసరిగా పాటించడం జరుగుతుందన్నారు. తొలగించిన ఓటర్లకు సజావుగా నోటీసులు పంపించే ప్రక్రియ సాగుతోందని ముఖ్యంగా మృతి చెందిన ఓటర్లకు సంబంధించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పొందడం లేదా పంచనామా నిర్వహించి ఓట్లను తొలగించడం జరుగుతుందన్నారు.బూతు స్థాయి అధికారుల నుండి ఏఈఆర్వోలు, ఈఆర్‌ఓలు, ప్రత్యేక అధికారులు,జిల్లా ఎన్నికల అధికారి అయిన తాను మూడు అంచెల్లో పూర్తిగా పరిశీలన చేస్తున్నామన్నారు.మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో తొలగించిన ఓట్లలో ఓటర్ల నమోదు అధికారి (ఈఆర్వో)1000 ఓట్లను, యాదచ్ఛికంగా వివిధ పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు 500 ఓట్లను, జిల్లా ఎన్నికల అధికారిగా తాను 100 తొలగించిన ఓట్లను పరిశీలించి సరైన పత్రాలతో దస్త్రాలు ఉన్నాయా లేదా గమనించడం జరుగుతుందన్నారు. ఇదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పరిశీలన కార్యక్రమం సజావుగా జరుగుతోందన్నారు.ఈ పర్యటనలో మచిలీపట్నం ఆర్డిఓ ఐ కిషోర్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, తహసిల్దార్ శ్రీ విద్య తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.










