
ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్ : రైతు భరోసా- పిఎం కిసాన్ సొమ్ము విడుదల చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టపర్తికి నవంబర్ 7న రానున్న నేపథ్యంలో సిఎం పర్యటనా ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నట్లు కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులతో కలసి ఆదివారం స్థానిక ఎయిర్‌పోర్టు, కాన్వారు రహదారి, మైదానంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా ప్రాంగణం తదితర ప్రాంతాలను పరిశీలించారు. బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విష్ణు, ఆర్డీవో భాగ్యరేఖ, డీఎస్పీ వాసుదేవన్, ఇంటెలిజెన్సీ అధికారులు పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు : సిఎం పర్యటన నేపథ్యంలో పటిష్టబందోబస్తును ఏర్పాటుచేసినట్లు ఎసీ తెలిపారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 40 మంది సిఐలు, 121 మంది ఎస్‌ఐలు, 242 మంది ఎఎస్‌ఐలు / హెడ్ కానిస్టేబుళ్లు, 509 మంది కానిస్టేబుళ్లు, 96 మంది మహిళా పోలీసులు, 244 మంది హోంగార్డులు, 3సెక్షన్ల ఎఆర్ పోలీసులు, 8 స్పెషల్ పార్టీ పోలీసు బృందాలను బందోబస్తు విధులకు కేటాయించామని ఎస్పీ చెప్పారు. సిఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 7న పుట్టపర్తికి వస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద జరుగుతుండడంతో, కొత్తచెరువు, గోరంట్ల వైపు నుండి పుట్టపర్తికి వచ్చే వాహనాలను సూపర్ స్పెషాలిటీ వద్ద నుండి బ్రాహ్మణపల్లి ఎనుములపల్లి మీదుగా పుట్టపర్తికి మళ్లిస్తున్నామన్నారు. అదేవిధంగా నల్లమాడ, బుక్కపట్నం వైపు నుండి పుట్టపర్తికి వచ్చే వాహనాలను, కొత్తచెరువు, గోరంట్ల బెంగళూరుకు వెళ్లే వాహనాలు గణేష్ సర్కిల్ నుండి బ్రాహ్మణపల్లి మీదుగా వయా హాస్పిటల్ వైపునకు వెళ్లే విధంగా మళ్లిస్తున్నామన్నారు. వాహనదారులు గమనించాలని వారు కోరారు.