పకడ్బందీగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు : కలెక్టర్
తొలుత గంగమ్మగుడి దర్శనం
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో ముందస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలు పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేసారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .ముఖ్యమంత్రి ఈ నెల 18న తిరుమల శ్రీవారికి బ్రహ్మౌత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, ఈ సందర్భంగా తిరుపతి , తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. మార్కెట్ యార్డు వద్ద శ్రీనివాస సేతు ప్రారంభించి , టిటిడి ఉద్యోగులకు ఇంటిపట్టాలు మంజూరు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని తిరుమల చేరుకొని గెస్ట్ హౌస్ లను ప్రారంభించి శ్రీపద్మావతి అతిధి గహం చేరుకుంటారు. ఆనంతరం రాత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి , ఈ నెల 19 న మరో మారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగుప్రయాణం కానున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో చిన్నపాటి లోపాలకు తావులేకుండా విధులు కేటాయించిన అధికారులు అప్రమత్తంగా వుండాలని అన్నారు. పర్యటన రహదారుల్లో బారికేడ్స్ ఏర్పాటు , భద్రత వంటివి పగడ్బందీ గా వుండాలని అన్నారు. అనంతరం శ్రీనివాస సేతు ప్రారంభించనున్న ప్రదేశాన్ని అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సమీక్షలో నగరపాలక కమిషనర్ హరిత , అడిషనల్ ఎస్ పి కులశేఖర్ , డి ఆర్ ఓ పెంచల కిషోర్ , ఆర్దిఒ లు కిరణ్ కుమార్ , చంద్రముని, ప్రోటోకాల్ డిప్యూటి కలెక్టర్ భాస్కర్ నాయుడు పాల్గొన్నారు.
18న శ్రీనివాస సేతు ప్రారంభం : కమిషనర్
ఈనెల 18న సోమవారం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న శ్రీనివాస సేతు పనులను గురువారం పోలీసు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి నగరపాలక కమిషనర్ హరిత పరిశీలించారు. నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసుకుని సిఎం చేతుల మీదుగా సోమవారం ప్రారంభించేందుకు తుది దశ పనులను కమిషనర్ పరిశీలించారు. అదనపు ఎస్‌పి కులశేఖర్, ఈస్ట్ డిఎస్‌పి సురేంద్రరెడ్డి,ట్రాఫిక్ డిఎస్‌పి నరసప్ప మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్ మున్సిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఆప్పాన్ రంగస్వామి, ఎయికామ్ ప్రతినిధి బాలాజీ పాల్గొన్నారు.
తొలుత గంగమ్మగుడి దర్శనం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తొలుత తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోనున్నారు. గత ఏడాదీ అలానే దర్శించుకున్నారని టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు. గతంలో గంగమ్మ తల్లిని దర్శించుకున్న తరువాతే తిరుమల శ్రీవారిని దర్శించుకునే సంప్రదాయం ఉండేదన్నారు.
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి










