Mar 13,2023 01:48
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

ప్రజాశక్తి-చీరాల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. ఆదివారం చీరాల ఎన్‌ఆర్‌పిఎం హైస్కూలో ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల13వ తేదీన జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పోలింగ్‌ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ పోలింగ్‌ సమయంలో అనుమానాలు వస్తే రాతపూర్వంగా తెలియజేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల్లో పిఒలు తప్పకుండా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ను నిర్వహించాల న్నారు. పోలింగ్‌ అనంతరం పోలింగ్‌ కేంద్రాల నుంచి రూట్‌ ఆఫీసర్ల సాయంతో పోలింగ్‌ సామగ్రిని రిసెప్షన్‌ కేంద్రానికి తీసుకురావాలని ఆమె అన్నారు. రిసెప్షన్‌ కేంద్రాల వద్ద ఎన్నికల సామగ్రి పూర్తిగా అప్పగించిన తరువాత మాత్రమే వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీ శివ జ్యోతి, చీరాల రెవెన్యూ డివిజనల్‌ అధికారి సరోజిని, బాపట్ల రెవెన్యూ డివిజనల్‌ అధికారి రవీంద్ర, ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.