ఈసారి నూతన విధానం అమలు
ప్రత్యేక ప్రొక్యూర్‌మెంట్ మోనటరింగ్ సెల్ ఏర్పాటు
21 రోజుల్లో రైతుల ఖాతాల్లో సొమ్మలు
తూకం అనంతరం ర్యాండమ్ పద్ధతిలో రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు
అధికారులతో సమీక్షా సమావేశంలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్
ప్రజాశక్తి - ఏలూరు
ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రొక్యూర్‌మెంట్ మోనటరింగ్ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై ప్రాథమిక వ్యవసాయ పరపతి సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు, రైస్ మిల్లర్స్, ట్రాన్స్ పోర్ట్ అసోషియేషన్, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పకడ్బందీగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేయాలన్నారు. కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సజావుగా సాఫీగా జరిగేందుకు రెండు నెలలపాటు ప్రొక్యూర్‌మెంట్ మోనటరింగ్ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రం పరిధిలోని పిఎసిఎస్‌లో సరిపడు గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. ఏ ప్రాంతంలో హార్వెస్టింగ్ అయి ధాన్యం ఏ తేదీన వచ్చేది వంటి అంశాలను ముందుగా పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా సంచుల సరఫరా చేయాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 3.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. కొనుగోలు విషయంలో ప్రతీరోజు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జిల్లాల వారీగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో ధాన్యం కోతలు జరుగుతున్నందున తక్షణమే అక్కడ కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. నూతన విధానం వల్ల రైతు ధాన్యం ఏ మిల్లుకు వెళుతుందో తెలియదని తద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందుకోవడంలో రైతు దళారుల మోసానికి గురికారన్నారు. రైతు కళ్లాల నుంచి ధాన్యం వే బ్రిడ్జికి వెళుతుందని అక్కడ నుంచి ర్యాండమ్ పద్ధతిలో కేటాయించిన రైస్ మిల్లుకు ధాన్యం చేరుతుందన్నారు. మిల్లర్లకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ విషయంలో ఉన్నతస్థాయి అధికారులతో చర్చించామని, సానుకూల దృక్పధం వచ్చిందని తెలిపారు. జెసి పి.అరుణ్‌బాబు మాట్లాడుతూ తేమ శాతం 17 కంటే తక్కువ ఉండాలన్నారు. పొలంలో రైతు ఆరబెట్టిన ధాన్యాన్ని సేకరించి వే బ్రిడ్జికి తీసుకువెళ్లి తూకం వేసి ఎఫ్‌టిఒ జనరేట్ చేస్తామన్నారు. అక్కడ నుండి ఆయా రైస్ మిల్లులకు ధాన్యం రవాణా అవుతుందన్నారు. ఈ విషయంలో వాలంటీర్ రైతు సహాయకుడిగా పనిచేస్తారన్నారు. ఇప్పటికే ప్రతీ మండలంలో వే బ్రిడ్జిలను గుర్తించామన్నారు. జిల్లాలో ప్రస్తుతం రైస్ మిల్లర్ల వద్ద 50 లక్షలు, పౌర సరఫరాల శాఖ వద్ద మరో 10 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. సొంత ట్రాక్టర్‌తో ధాన్యం తోలిన రైతులకు రవాణా ఛార్జి ఆ రైతుకే చెల్లింపు జరుగుతుందన్నారు. 21 రోజుల్లో డబ్బు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు మంజు భార్గవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై.రామకృష్ణ, జిల్లా సహకార శాఖ అధికారి ప్రవీణ, జడ్‌పి సిఇఒ కె.రవికుమార్, డిఎస్‌ఒ రాజు, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, డ్వామా పీడీ డి.రాంబాబు పాల్గొన్నారు.










