నిర్వహణపై జిల్లా అధికారులు, ఎసిఎ ప్రతినిధులు సమీక్ష
ప్రజాశక్తి- పిఎం పాలెం : ఆసీస్ జట్టు భారత పర్యటనలో భాగంగా మధురవాడ వైఎస్‌ఆర్ ఎసిఎ, విడిసిఎ క్రికెట్ స్టేడియంలో మార్చి 19న జరిగే రెండో వన్డే మ్యాచ్ నిర్వహణపై శుక్రవారం నిర్వహణ కమిటీ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున్, నగర సిపి సిహెచ్. శ్రీకాంత్, జివిఎంసి కమిషనర్ పి.రాజబాబు, ఎసిఎ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్మి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్టేడియంలో పలు మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహించిన నేపథ్యంలో బిసిసిఐ, విశాఖలో భారత్, ఆసీస్ వన్డే మ్యాచ్ నిర్వహణకు మరో ఆవకాశం కల్పించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్‌ల నిర్వహణకు బిసిసిఐ సన్నద్ధత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రతిమ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత నిర్వహణ కమిటీపై ఉందన్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్ల ధరలు, అమ్మకాలపై మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే ఆన్‌లైన్‌లో 70శాతం ఆఫ్‌లైన్‌లో 30 శాతం టిక్కెట్లు అందుబాటులోఉంచుతామన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించామన్నారు. గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో కొన్ని లోటుపాట్లుపై కూడా చర్చించామని, అన్ని శాఖల సమన్వయంతో ఈ మ్యాచ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నరు. మ్యాచ్ నాటికి ఎండలు తీవ్రమయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ గతంలో మ్యాచ్‌ల సమయంలో తలెత్తిన ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందుగానే నిర్వాహకులు ప్రకటించిన సమయానికి ప్రేక్షకులు వస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్యులకు టిక్కెట్లు అందేలా సరికొత్త ఆలోచనతో టికెట్స్ అమ్మకాలను డిస్‌ప్లేలో పెట్టి అమ్మకాలను నిర్వహిస్తామన్నారు.
జివిఎంసి కమిషనర్ రాజబాబు మాట్లాడుతూ తాగునీరు, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా జివిఎంసి ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారుల బృందం, ఎసిఎ ప్రతినిధులు స్టేడియం పక్కనే ఉన్న జాతీయరహదారిలో ట్రాఫిక్‌ను పరిశీలించి, ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై చర్చించారు.










