ప్రజాశక్తి-అరకులోయ రూరల్:పాడేరు ఐటీడీఏ పరిధిలో పివిటీజీల సమస్యలపై పోరాటం చేస్తామని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ తెలిపారు. గురువారం అరకువేలి ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.రామన్న అధ్యక్షతన అరకువేలి, డుంబ్రిగుడ, అనంతగిరి పివిటీజీలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా బాలదేవ్ మాట్లాడుతూ, పాడేరు ఐటీడీఏ పరిధిలో కోదు, పరెంగిపొర్జ, గదభ, పొర్జ తెగల పివిటిజీలు సుమారు 244 పంచాయతీల్లో 1664 గ్రామాల్లో సుమారు లక్ష 75 వేల మంది ఉన్నారని అన్నారు. 2019లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పివిటిజీలకు అంత్యోదయ కార్డులు రద్దు చేయడం దుర్మార్గమన్నారు. అర్హులైన పివిటిజీలకు అంత్యోదయ కార్డులు తక్షణమే మంజూరు చేయలని డిమాండ్ చేశారు.పివిటిజీలకు సిసిడిపి నిధుల ద్వారా వ్యక్తిగత సబ్సిడీ రుణాలు, సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యాలు, కమ్యూనిటీ హాలు, అంగన్వాడీ కేంద్రాలకు ఖర్చు చేయకుండా జగన్ ప్రభుత్వం దారి మళ్ళిస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వ్యవసాయ పరికరాలు, వాణిజ్య పంటల యంత్రాలు, మిరియాల నిచ్చెన్నలు పూర్తిగా సబ్సిడీతో పంపిణి చేయలేదన్నారు.పివిటిజిలకు కేంద్ర ప్రభుత్వం 2023-25 సంవత్సరాలకు 15వేల కోట్లు ప్రకటించిందని పాడేరు ఐటీడీఏ పరిధిలో ఎంత కేటాయించారో నేటికీ సమగ్ర సమాచారం లేదని ఆయన అన్నారు.కేటాయించిన నిధులు పివిటిజిలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. పివిటిజిల సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్.అప్పలరాజు, అప్పన్న, నగేష్, రాజు, సత్యారావు, మాతృభాష విద్య వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కుమారి, బుజ్జిబాబు ఎస్.అప్పన్న, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.










