Jan 28,2023 23:50

సమస్యలు తెలుసుకుంటున్న బృందం ప్రతినిధులు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో మారుమూల ప్రాంతమైన లక్ష్మీపురం పంచాయతీ అర్లాయిపుట్‌ పివి టిజి గ్రామంలో కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఎన్‌ఎస్‌టిఎఫ్‌డిసి సెక్రటరీ కుంజు బీహారీ, పిటిజి ఐటిడిఎ అసిస్టెంట్‌ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు, టిసిఆర్‌టిఎం ప్రొపెసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌లు శనివారం పర్యటించారు. పివిటిజిల జీవన విధానం, స్థితి గతులు అధ్యయనం చేసేందుకు వీరు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌ కొర్ర త్రినాథ్‌ అధికారులతో మాట్లాడుతూ, పంచాయతీ పరిధి పలు గ్రామాలలో అనుసంధాన రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ భవనం, కమ్యూనిటీ భవనం, తాగునీటి పథకాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజన రైతులు పండించిన పంటలకు, చిరుధాన్యాలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల వేతన బకాయిలు తక్షణమే చెల్లించి సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. పివిటిజిలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అతిమారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న పీవీటీజిలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, నిధులు మంజూరు చేయాలనని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో మారుమూల గ్రామాలలో రహదారులు, తాగునీటి వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సచివాలయానికి ఇంటర్నెట్‌ సౌకర్యం లేక పోవడంతో ప్రతి చిన్న సమస్యను పరిష్కరించుకునేందుకు మండల కేంద్రానికి వెళ్లవలసి వస్తుందని వాపోయారు. ఆధార్‌ సీడింగ్‌, తదితర పనులకు పలు గ్రామాల నుండి గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతూ తహశీల్దార్‌ కార్యాలయానికి వాహనాలు లేక కాలినడకన నడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఎదుర్కొంటునారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.