Mar 29,2023 00:20

సమావేశంలో మాట్లాడుతున్న పి

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఆదివాసీలు (పివిజిటి) సామాజిక స్థితి గతులపై సమగ్రమైన డేటా సేకరించాలని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. మంగళవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో 11 మండలాల ఎంపిడిఒలు, తాహశీల్దారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఆదిమ జాతి గిరిజనులు (పివిటిజిలు) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందన్నారు. పాడేరు ఐటిడిఎ పరిధిలోని ఫోర్జ, గదబ, కోదు సామాజిక వర్గాల పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. పివిటిజి గ్రామాల్లో విద్యుత్తు, రహదారుల నిర్మాణాలు, తాగునీటి సదుపాయాల వంటి సామాజిక అభివృద్ధి, గృహ నిర్మాణాలు, స్వయం ఉపాధి పథకాలు వంటి వ్యక్తిగత లబ్ది చేకూరుతోందన్నారు. ఎంపిడిఒలు, తాహశీల్దారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సచివాలయం సిబ్బంది సహాకారంతో పివిటిజిల జనాభా, ఉపకులాల వారీగా వివరాలతో సమగ్రమైన డేటా సేకరించాలన్నారు. . గతంలో సేకరించిన వివరాలలో తప్పులు ఉన్నాయని,అధికారుల సమన్వయంతో పని చేసి కచ్చితమైన డేటా సేకరించి, వారం రోజులలో సమర్పించాలని ఆదేశించారు. పివిటిజిల అభివద్ధికి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. తాగునీటి సదుపాయాలు, రహదారి సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, గహ నిర్మాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యుత్‌ సౌక్యరాలు, డిఆర్‌ డిపోలు, సంక్షేమ పథకాల వివరాలు సేకరించాలని సూచించారు. గతంలో సేకరించిన డేటాలో ఉన్న తప్పులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, ఐటిడిఎ ఎపిఒలు ఎం.వేంకటేశ్వరరావు, విఎస్‌ ప్రభాకరరావు, డిఎల్‌పిఒ పిఎస్‌ కుమార్‌, ఎంపిడిఒలు, తాహశీల్దారులు, గిరిజన సంక్షేమశాఖ ఇఇలు డివిఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్‌, పిఐయు ఇఇ కె.లావణ్యకుమార్‌, పిఆర్‌ ఇఇ కొండయ్యపడాల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇఇ లీలాకృష్ణ, జిసిసి డిఎం కె.పార్వతమ్మ, పాడేరు ఎంపిడిఒ నవీన్‌ సాయి, 11 మండలాల ఎంపిడిఒలు పాల్గొన్నారు.