Jan 15,2023 00:08

రమణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-మునగపాక రూరల్‌
మాజీ శాసనసభ్యులు, ఆర్‌ఇసిఎస్‌ మాజీ చైర్మన్‌ కీర్తిశేషులు పివి.రమణ 14వ వర్థంతి కార్యక్రమం మండల కేంద్రం మునగపాక రైతు బజార్‌ ఆవరణలో శనివారం జరిగింది. రైతు సంఘాల నాయకులు ఎ.బాలకృష్ణ, ఆళ్ల మహేశ్వరరావు, సిఐటియు నాయకులు శంకరరావు, వివి శ్రీనివాసరావు, ఎస్‌.బ్రహ్మాజీ తదితరులు పివి.రమణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.బాలకృష్ణ, సిఐటియు నాయకులు శంకర్రావు అభ్యుదయ భావాలకు, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం పివి.రమణ అని కొనియాడారు. పలు మార్లు ప్రజా ప్రతినిధిగా పనిచేసినా ఎటువంటి ఆస్తులు సంపాదించుకోకుండా రైతుల కోసం, ప్రజల కోసం ఎనలేని కృషి చేసి ఈ ప్రాంత ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాధించుకున్నారని తెలిపారు. పివి రమణ శాసనసభ్యులుగా ఉన్న కాలంలో సాగిన బెల్లం రైతుల ఉద్యమం రైతాంగానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. కమ్యూనిస్టు భావాలతో అణగారిన వర్గాల వారికి సేవ చేయాలనే దృక్పథంతో అలుపెరుగని పోరాటం చేశారని పేర్కొన్నారు. నేటి ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాలు రైతులను ఆత్మహత్యలకు పురి గొలుపుతున్నాయని, ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే పీవీ రమణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లినట్లు అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టెక్కలి జగ్గారావు, కాండ్రేగుల రాము, పివి రమణ కుమారుడు పెంటకోట కృష్ణ, కుటుంబ సభ్యులు పెంటకోట ఆదినారాయణ, పివి రమణ అభిమాని టెక్కలి వీర కొండలరావు పాల్గొన్నారు.