ప్రజాశక్తి-రాజహేంద్రవరం సమగ్ర శిక్ష పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ల సమస్యలు పరిష్కరించాలని, వారిని ప్రభుత్వ హామీ ప్రకారం రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని పార్ట్ టైం ఇనస్ట్రాక్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం డిమాండ్ చేసింది. శనివారం రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రం వద్ద గల అంబేద్కర్ భవనంలో నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర మాట్లాడారు. రూ.4000లతో విధుల్లో చేరిన ఆర్ట్, క్రాఫ్ట్ ఉద్యోగులు అనేక పోరాటాలు చేసి రూ.14000కు వేతనాలు పెంచుకోగలిగామన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో పోలిస్తే ఈ వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టతరంగా ఉందని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పార్ట్‌టైమ్‌గా ఉద్యోగంలో చేరిన తమను ఫుల్ టైం విధులు నిర్వర్తించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఆర్ట్స్, క్రాఫ్ట్‌కు ఎలాంటి సిలబస్, మెటీరియల్, నిధులు కేటాయింపు లేవన్నారు. జగనన్న విద్యాకానుక కిట్లు స్కూల్స్‌కు అందించేందుకు ఇనస్ట్రక్టర్స్‌ను హమాలీలు మాదిరిగా వాడుతున్నారన్నారు. వేసవి సెలవుల్లో సైతం సెలవల్లేకుండా విధులు నిర్వహిస్తున్నామన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ మాట్లాడుతూ ఉద్యోగులు సమస్యలపై ఐక్యంగా పోరాడాలని, వారి పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో పిటిఐ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మల్లేశ్వరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కె.రామ్మోహన్, జిల్లా అధ్యక్షులు మిరప రాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి.పూర్ణిమరాజు మాట్లాడారు. అనంతరం డిఇఒ అబ్రహాంకు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో కార్యదర్శి మోహిని, కోశాధికారి దుర్గా ప్రసాద్, సహాయ కార్యదర్శి జి.సురేష్, పివివి.సత్యనారాయణ మూర్తి, టి.రాంబాబు, కె.రామ్‌ప్రసాద్, టి.వెంకటేష్, కార్యవర్గ సభ్యులు సత్యానందం, ప్రియదర్శిని, గీత, వరలక్ష్మి, సలోమి పాల్గొన్నారు.










