Nov 08,2023 00:46

- కక్షధోరణిలో ఈపురిపాలెం బాయ్స్ హైస్కూల్ హెచ్ఎం
- హైస్కూల్ వద్ద విద్యార్థితో తల్లి నిరసన 
ప్రజాశక్తి - చీరాల
బడి బాట పట్టించి నాలుగు అక్షరాలు నేర్పి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ హెచ్ఎం కక్షపూరితంగా వ్యవహరిస్తూ విద్యార్థి తల్లిపై కోపంతో ఏకంగా విద్యార్థికి టీసి ఇచ్చి బయటకు పంపించింది. ఇదేంటని ఆ తల్లి హెచ్ఎం తీరును ప్రశ్నిస్తూ తన కొడుకుతో సహా స్కూలు వద్ద నిరసన తెలిపారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనపై కక్ష ధోరణితోనే తన బిడ్డ చదువు మధ్యలో ఆపేసేలా టీసి ఇచ్చారని ఈపురిపాలెం బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం రత్నావళిపై విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఈపురిపాలెం హైస్కూల్లో ఆయాగా పనిచేస్తూ దేవరపల్లి అనూషా కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, తన కొడుకును 10వ తరగతి అదే హైస్కూల్లో చదివిస్తున్నానని అన్నారు. పాఠశాల హెచ్ఎం రత్నావళి తనను ఆయా ఉద్యోగం నుండి అకారణంగా తొలగించారని అన్నారు. అయితే ఏ కారణంతో తొలగించారంటూ హెచ్ఎంను అడిగినప్పటికీ సరైన సమాధానం చెప్పకపోవడంతో తాను చేసేది ఏమీ లేక జరిగిన  విషయంపై డిఇఓకు ఫిర్యాదు చేశానని అన్నారు. తనపై ఫిర్యాదు చేశాననే కక్ష్యతో 10వ తరగతి చదువుతున్న తన కుమారుడు దేవరపల్లి అశోక్ దాస్‌కు టిసి ఇచ్చి స్కూల్ నుండి పంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నత అధికారులెవరు తనను ఏమి చేయలేరని బెదిరింపు చర్యలకు హెచ్‌ఎం పాల్పడుతున్నట్లు ఆరోపించారు. దింతో తనకు న్యాయం చేయాలని కోరుతూ నిరసనగా స్కూల్ ఎదురుగా తల్లీ, కొడుకులు బైఠాయించారు. తల్లిపై కోపంతో విద్యార్థికి టీసీ ఇచ్చి బయటకు పంపించే పద్ధతి సరైనది కాదని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అంటున్నారు. ఈ విషయంపై ఎంఈఓను ప్రజాశక్తి వివరణ కోరగా విద్యార్థికి టీసి ఇచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. ఆ పాఠశాల డిప్యూటీ డీఈఒ పరిధిలో ఉంటుందని తెలిపారు. జరిగిన విషయం తన దృష్టికి వచ్చిందని, విచారించి చర్యలు తీసుకుంటామని అన్నారు.