ప్రజాశక్తి-పాడేరు: గిరిజన ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తూ, ప్రజాప్రతినిధులను హేళన చేస్తున్నారని, తక్షణమే పాడేరు ఐటీడీఏ పివోను ప్రభుత్వం సరెండర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏడు రోజులుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. ఉద్యమ నాయకులు దీక్ష శిబిరం వద్ద క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన వ్యతిరేకి పాడేరు ఐటీడీఏ పీవోను ప్రభుత్వం వెంటనే సరెండర్ చేయాలని, గిరిజన విద్యార్థుల మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ కూడ రాధాకృష్ణ మాట్లాడుతూ, పాడేరు ఐటిడిఏ ఎదురుగా నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నా.. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఐటీడీఏ పిఓను ప్రభుత్వం సరెండర్ చేసే వరకు ఉద్యమం ఆగదని, అవసరమైతే ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పెదబయలు మండల తహసిల్దార్ ఆత్మహత్య చేసుకోవడానికి పాడేరు పిఓ వేధింపులే కారణమని వస్తున్న ఆరోపణలపై ఆయనను రక్షించడానికి సామాన్య గిరిజన ఉద్యోగులను సస్పెండ్ చేయడం తగదన్నారు.గిరిజన ప్రాంతంలో విద్యార్థుల వరస మరణాలు జరుగుతుంటే పాడేరు ఐటీడీఏ పీఓకు మాత్రం కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని,హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ వేదికపై అన్ని ప్రజా, కార్మిక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కో కన్వీనర్ కిల్లో ప్రభుదాస్, చిన్నారావు, మువ్వల లక్ష్మణరావు, కదేలి చంటిబాబు, గిరిజన నిరుద్యోగుల సంఘం అధ్యక్షులు కుమార్, కే.లతాకుమారి, జీవన్ కృష్ణ, గిరిజన సంఘం నాయకులు రామారావు, ప్రసాద్, రావణ్, తదితరులు పాల్గొన్నారు.










