Jan 22,2023 23:25

దీక్షను చేపడుతున్న ప్రజా సంఘాల నేతలు

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు గిరిజన వ్యతిరేకి పాడేరు ఐటీడీఏ పీవో రోనంకి గోపాలకృష్ణకు కొమ్ము కాయడం తగదని, పిఒపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి, జాతీయ, రాష్ట్ర ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కూడా రాధాకృష్ణ, కో కన్వీనర్‌ కే.ప్రభుదాస్‌ వెల్లడించారు. ఐటీడీఏ వద్ద చేపట్టిన రిలే దీక్షలు 35వ రోజుకు చేరిన సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ, పాడేరు ఐటిడిఏ పీవో గిరిజన ప్రజా ప్రతినిధులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని, తక్షణమే సరెండర్‌ చేసి గిరిజనుల మనోభావాలను పరిరక్షించాలన్నారు. పాడేరు ఐటిడిఏ జిల్లా హెడ్‌క్వార్టర్‌ లో సుమారు 6 మంది గిరిజన విద్యార్థులు ఇటీవల కాలంలో మృతి చెందితే కనీసం విద్యార్ధుల కుటుంబాలను పీవో పరామర్శకు కూడా వెళ్ల లేదని విమర్శించారు. విద్యార్థుల మృతికి బాధ్యులను చేస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్‌ను అక్రమంగా సస్పెండ్‌ చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు చిన్నారావు, బత్తిరి నరేష్‌, లోకేష్‌, తదితరులు పాల్గొన్నారు.