Jan 09,2023 23:40

దీక్ష చేపడుతున్న నేతలు

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన సమస్యల పరిష్కారంపై ఐటీడీఏ పీవో రోనంకి గోపాలకష్ణ మొండి వైఖరిని విడనాడాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కూడా రాధాకృష్ణ, కోకన్వీనర్‌ కిల్లో ప్రభుదాస్‌ డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ ఎదుట ప్రజా సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం 22వ రోజు కొనసాగాయి. ఈ దీక్షలనుదేశించి వారు మాట్లాడుతూ, గిరిజన సంక్షేమం, అభివృద్ధిని పిఓ విస్మరించారని విమర్శించారు. కాఫీ రైతులకు ఐటీడీఏ ద్వారా ప్రోత్సాహకాల చెల్లించ లేదన్నారు. కాఫీ కొనుగోలులో గిరిజన రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రైవేటు సంస్థతో గిరిజన రైతుల నుంచి తక్కువ ధరకు కాఫీ కొనుగోలు చేయడానికి పిఒ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఐటీడీఏ అధికారిగా గిరిజనులకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇటువంటి విధానాలకు పిఒ పాల్పడటం సరికాదన్నారు. పీవోను తక్షణమే సరెండర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 22 రోజులుగా తాము రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ గిరిజన సమస్యలపై స్పందించకుండా అధికారులు ఏకపక్షంగా, నిర్లక్ష్యంగా ఉండటం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు తామ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల వేదిక నాయకులు చిన్నారావు, బత్తిరి నరేష్‌, కంబిడి లతకూమరి, స్వరూప, అమర్‌ పాల్గొన్నారు.