Oct 20,2023 21:42

కలెక్టరేట్‌ వద్ద నిరాహారదీక్ష చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  30 నుంచి 35 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలు అందించే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రిటైర్డు అయిన తర్వాత పెన్షన్‌ పొందడం వారి హక్కు. వారి సేవలకు ఇచ్చే గుర్తింపు అది. అటువంటి హక్కును అమలు చేయకుండా నేడు రాష్ట్రంలో ఉద్యోగుల పెన్షన్‌ హక్కును కాలరాసే విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఎన్నికల ముందు.. అధికారంలోకి వచ్చిన వారం రోజులో సిపిఎస్‌ను రద్దు చేస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారం లోకి వచ్చి నాలుగున్నరేళ్లుఅవుతున్నా సిపిఎస్‌ను రద్దు చేయకపోగా సిపి ఎస్‌ కంటే ప్రమాదకరమైన జిపిఎస్‌ విధానాన్ని తీసుకొచాచరు. దేశంలో ఆరు రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సిపిఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం దారుణమని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గత నాలుగేళ్లుగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, సిపిఎస్‌ ఉద్యోగ సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. యుటిఎఫ్‌ సైకిల్‌ ర్యాలీలు, బ స్సు యాత్రలు, ధర్నాలు, పాదయాత్రలు చేపట్టింది. కొంత కాలం పాటు సబ్‌ కమిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలక్షేపం చేసింది.నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటంతో జిపిఎస్‌ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలకు ఇష్టం లేక పోయినా బలవంతంగా జిపిఎస్‌ను తీసుకువచ్చింది. ఇది సిపి ఎస్‌ కంటే ప్రమాద కరంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మరో వైపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు డిఎ, పిఅర్‌సి, ఎపి జి ఎల్‌ఐ, గ్రాట్యుటీ బకాయిలు సుమారుగా రూ.11వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2022 జూలై నుంచి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు 2003 నోటిఫికేషన్‌ ప్రకారం ఉద్యోగంలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయకుండా మరో మోసానికి తెరలేపింది. కేంద్ర ప్రభుత్వం 57 మెమో ద్వారా 2004 ముందు నోటిఫికేషన్‌ ప్రకారం ఉద్యోగం పొందిన వారు పాత పెన్షన్‌ విధానంలో వస్తారని చెప్పింది. అనేక రాష్ట్రాల్లో మెమో 57 ప్రకారం పాత పెన్షన్‌ పథకం అమలు చేశాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2003 నోటిఫికేషన్‌ ప్రకారం ఉద్యోగం పొందిన సుమారు 11వేల మంది ఉద్యోగులకు, జిల్లాలో 600 మందికి పైగా ఉద్యోగులకు ఒపిఎస్‌ అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసింది. దీంతో ఒపిఎస్‌ సాధన కోసం, సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు కోసం యుటిఎఫ్‌ నిరవధిక దీక్ష చేపట్టింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈ పోరాటం దీర్ఘ కాలిక పోరాటంగా సాగనుంది.
భద్రత లేని పెన్షన్‌ మాకొద్దు
ఉద్యోగుల పెన్షన్‌ కు భద్రత లేని జిపిఎస్‌ విధానం మాకొద్దు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని గ్యారెంటీ ఉంది తప్ప ఉద్యోగుల డబ్బుకు గ్యారెంటీ లేదు. ఎంత పెన్షన్‌ ఇస్తారో కూడా అందులో లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒపిఎస్‌ అమలు చేయాలి.
- డి.రాము, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు
ఒపిఎస్‌ అమలు చేయకుంటే దీర్ఘకాలిక పోరాటం
జిపిఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ పథకం అమలు చేయకుంటే దీర్ఘ కాలిక పోరాటమే శరణ్యం. చట్ట బద్దత లేని జిపిఎస్‌ విధానం సరికాదు. ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ అనే నినాదాంతో ఒపిఎస్‌ సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధతం చేస్తాం.
- కె.విజయగౌరి, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు
గుణపాఠం తప్పదు
జిపిఎస్‌ రద్దు చేయకుంటే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పక తప్పదు. శక్తి యుక్తులను ఒడ్డి సేవలు అందించిన ఉద్యోగులకు రిటైరైన తర్వాత గౌరవంగా ఇచ్చే పెన్షన్‌ లేకుండా చేయడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల లో పెన్షన్‌ అమలు చేసి, మాకు రావాల్సిన పెన్షన్‌ హక్కును ఇవ్వకుండా చేయడం దుర్మార్గం.
- జెఎవిఆర్‌కె ఈశ్వరరావు,
యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

హామీని అమలు చేయాలి
మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ రద్దు చేసి, ఒపిఎస్‌ అమలు చేయాలని కోరుతున్నాం. ఓట్లు రాజకీయాలు మానుకొని ఇచ్చిన హామీ అమలు చేసి, చిత్తశుద్ది నిరూపించుకోవాలి. ఎంపి,ఎమ్మెల్యే లకు పెన్షన్‌ ఇస్తున్న ప్రభుత్వం 30 ఏళ్లకు పైగా సేవలు అందించే ఉద్యోగాలకు పెన్షన్‌ లేకుండా చేయడం సరికాదు.
- జె.రమేష్‌ చంద్ర పట్నాయక్‌,
యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు

న్యాయబద్ధంగా ఇవ్వాల్సిందే
న్యాయబద్దంగా మాకు అమలు చేయాల్సిన ఒపిఎస్‌, కేంద్రం ఇచ్చిన మెమో 57 అమలు కోసం, జిపిఎస్‌ రద్దు కోసం ఉద్యమిస్తాం. ఎటువంటి అంగీకారం తీసుకోకుండా బలవం తంగా జి పిఎస్‌ తీసుకు రావడం అన్యాయం. అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి.
- రెడ్డి మోహనరావు,
యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

కుంటిసాకులు మానుకోవాలి
ప్రభుత్వం ఆర్థిక భారమని రక రకాలుగా కుంటి సాకులు చెప్పడం మానుకోవాలి. దేశంలో ఆరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఒపిఎస్‌ విధానం ఇక్కడ ఎందుకు అమలు కాదు?. అమలు చేయాలనే చిత్తశుద్ది పాలకులకు లేకపోవడమే కారణం. అన్ని రాజకీయ పార్టీలు ఒపిఎస్‌కు మద్దతు పలకాలి. ఒపిఎస్‌ సాధించే వరకు పోరాటం ఆగదు.
- పి.రాంప్రసాద్‌, సిపిఎస్‌ సబ్‌ కమిటీ కన్వీనర్‌