Oct 16,2022 23:47

పోలియోతో నడవలేని స్థితిలో జగబంధు

పోలియో బాధిత బాలుని తండ్రి ఆవేదన
ప్రజాశక్తి -సీలేరు:
పుట్టుకతో పోలియో బారిన పడి నడవలేని దుస్థితిలో ఉన్న తన కొడుకుకు సదరం సర్టిఫికేట్‌ ఇప్పించి, వికలాంగ పింఛను మంజూరుచేసి ఆదుకోవాలని నిరుపేద తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కొడుకుకు సదరం సర్టిఫికెట్‌, పింఛను మంజూరు కోసం సచివాలయాలు, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, ఎవరూ స్పందించడం లేదని విలేకరుల ముందు గోడును వెలబుచ్చాడు.
జీకే వీధి మండలం ధారకొండ పంచాయతీ చెక్కల మద్ది గ్రామానికి చెందిన కొర్ర మాధవ ఎనిమిదేళ్ల కుమారుడు కోర్ర జగబంధు పుట్టుకతోనే పోలియో బారిన పడి, రెండు కాళ్లూ చచ్చుబడి, నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులే ఆ బిడ్డ ఆలనాపాలనా చూస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అయితే ఆర్థికంగా తన కొడుకుకు ఆసరాగా ఉండేందుకు వికలాంగ పింఛను మంజూరు చేయాలని వేడుకుంటున్నాడు. నిలబడలేని, ఎటూ వెళ్లలేని నిస్సహాయస్థితిలో ఉన్న కొడుకు దుస్థితిని చూసి కలత చెందిన ఆ దంపతులు ప్రభుత్వపరంగా ఆసరా, సాయం కోసం అర్థిస్తున్నారు. పింఛను రావాలంటే సదరం సర్టిఫికెట్‌ అవసరమని కూడా తెలియని వాళ్లూ ఇన్నాళ్లుగా దాని కోసం ప్రయత్నించలేదు. దీనిపై ఇంటింటికి వెళ్లి సంక్షేమ సేవలుఅందిస్తున్న వాలంటీర్లుగానీ సచివాలయ సిబ్బందిగానీ చెప్పలేదని అంటున్నారు. ఎలాగోలా తెలుసుకుని, తన కొడుకు జగబంధుకు వికలాంగ ధ్రువీకరణ కోసం ప్రయత్నం ప్రారంభించి, వాలంటీర్లు, సచివాలయాల వద్దకు వెళ్లినా పని జరగడం లేదని వాపోతున్నాడు .ఇటీవల ఇక వృద్ధురాలికి పింఛను పునరుద్ధరణకు చొరవ చూపిన అల్లూరి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, తమ దుస్థితిపై కూడా దృష్టి సారించాలని, తన బిడ్డకు సదరం సర్టిఫికెట్‌ ఇప్పించి, పింఛను మంజూరుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు. కలెక్టర్‌ స్పందన కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు.