Dec 05,2022 23:57

బాధిత వృద్ధురాలు గంగమ్మ

ప్రజాశక్తి- బుచ్చయ్యపేట
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు సలాది గంగమ్మ. వయసు 85 సంవత్సరాలు పైమాటే. మండలంలోని చింతపాక గ్రామానికి చెందిన గంగమ్మ భర్త 40 ఏళ్ల క్రితమే మరణించారు. వీరి కుమారుడు, కుమార్తెకు వివాహం కావడంతో వారు వేరుగా జీవిస్తున్నారు. ప్రభుత్వ పింఛను నెలకు రూ.30 ఉన్నప్పటి నుంచి 8 నెలల క్రితం వరకు గంగమ్మ పింఛను పొందుతూ వస్తుంది. ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం ఆమె పింఛను నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో పింఛను కోసం ఎదురుచూస్తోంది. రెండు నెలల క్రితం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిమిత్తం గ్రామానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దృష్టికి పింఛను నిలిపివేసిన విషయాన్ని గ్రామస్తులు తీసుకెళ్లారు. స్పందించిన ధర్మశ్రీ పింఛను పునరుద్ధరించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కానీ నేటికీ పింఛను మంజూరు కాలేదు. గంగమ్మ కుమారుడు భార్య పిల్లలతో బతుకుతెరువు నిమిత్తం సామర్లకోట వెళ్లిపోయారు. కుమార్తె వివాహం కావడంతో వేరేచోట ఉంటుంది. గంగమ్మ మాత్రమే గ్రామంలో ఉంటుంది. నడవడానికి కూడా అవకాశం లేక, సరిగా వినపడక, కనబడక ఇంట్లోనే పాకుతూ మంచంపై జీవచ్శవంలా ఉంటుంది. ఇరుగుపొరుగు వారు ఏమైనా ఆహారం పెడితే తింటుంది. లేదంటే లేదు. ఏడు ఎనిమిది నెలలుగా పింఛను నిలిపివేయడంతో టీ నీళ్లు తాగడానికి కూడా డబ్బులు లేవని ఆమె వాపోతోంది.
పింఛను పునరుద్ధరించాలి : టిడిపి
ఇదేం కర్మా రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు గూనూరు మల్లునాయుడు ఆదివారం రాత్రి గ్రామంలో ఇంటింటికి వెళ్లారు. ఈ సమయంలో తన పింఛను నిలిపి వేసిన విషయాన్ని గంగమ్మ తెలిపింది. దీనికి స్పందించిన టిడిపి నేతలు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 80 ఏళ్ల పైబడిన వృద్ధురాలికి పింఛను నిలిపివేయడం దారుణమని, తక్షణమే పింఛను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.