Sep 20,2023 22:00

సెమినార్‌లో మాట్లాడుతున్న ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజశర్మ

ప్రజాశక్తి-రాజాం : దేశవ్యాప్తంగా పింఛను కోసం ఉద్యోగులు ఉధృత ఉద్యమాలు సాగిస్తున్నారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజశర్మ తెలిపారు. బుధవారం స్థానిక ఎల్‌ఐసి కార్యాలయం వద్ద పీపుల్స్‌ ఫర్‌ ఇండియా ఆధ్వర్యాన చైర్మన్‌ ఎం.అప్పలనాయుడు అధ్యక్షతన 'ఎన్‌పిఎస్‌ రద్దు.. ఒపిఎస్‌ అందరికీ' అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో 2004 నుంచి అమలు చేస్తున్న నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పిఎస్‌) వల్ల ఉద్యోగులకు పింఛను భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పింఛను భిక్ష కాదని, ఉద్యోగుల హక్కని 1982 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులు పాత పింఛను కోసం ఉద్యమాలు సాగిస్తున్నారని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా పింఛను కోసం జాతా జరుగుతుందని, మన రాష్ట్రంలో ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీపుల్స్‌ ఫర్‌ ఇండియా కన్వీనర్‌ డివిఎస్‌ శ్రీనివాసరావు, పలు సంఘాల నాయకులు ఎం.మోహబ్‌, పక్కి వేణు, ఎన్‌.రామకృష్ణ, ఎం.జితేంద్రరావు, రామ్మూర్తినాయుడు. వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.