Apr 13,2023 00:17

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ : రాజధాని గ్రామాల్లో పేదలకు ఇవ్వాల్సిన పింఛన్లను 12 రోజులు దాటినా ఇవ్వకపోవడంతో లబ్ధిదార్లు బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. నిడమర్రులోని 2వ నంబరు సచివాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.భాగ్యరాజు మాట్లాడుతూ నిడమర్రులో 1742 మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా 808 మందికే ఇచ్చారని, మిగిలినవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పనుల్లేక సామాన్యులు, పేదలు ఇబ్బంది పడుతున్నారని, వారికిస్తున్న కొద్దిపాటి పింఛను కూడా సమయానికి ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని ఆవేదన వెలిబుచ్చారు. నిలిచిన పింఛన్లలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులు కూడా ఉన్నారని, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే సామాజిక పింఛనును రూ.5 వేలు చేస్తామని హామీనిచ్చిన వారు దాన్ని నెరవేర్చకప్గోఆ ఇస్తున్న దాన్ని కూడా సమయానికి ఇవ్వడం లేదని విమర్శించారు. గతంలో మూడు నెలల పెండింగ్‌లో పెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పింఛను సొమ్మును వెంటనే విడుదల చేయాలని కోరారు. ధర్నాలో నాయకులు జి.నాగేశ్వరరావు, సునీత, వెంకాయమ్మ, కె.సుమతి, లబ్ధిదారులు పాల్గొన్నారు.