Sep 13,2023 00:11

ముద్దాయిల్లో సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌
ప్రజాశక్తి-అనకాపల్లి :
జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించిన పింఛన్ల సొమ్ము అపహరణ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఎస్‌పి కథనం ప్రకారం... అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చెందిన అలజంగి నానిబాబు, విశాఖ జిల్లా గాజువాక ములగాడ హౌసింగ్‌ కాలనీకి చెందిన దేవిరెడ్డి సాయి కుమార్‌, మల్కాపురం జనతా కాలనీకి చెందిన చందక సాయి చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిలో నానిబాబు నక్కపల్లి మండలం జానకయ్యపేట సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు ముగ్గురు ప్రతి ఆదివారం గాజువాకలోని ఒక చర్చిలో కలుసుకునేవారు. వీరి అవసరాలకు తగిన డబ్బు కోసం నేరం చేసేందుకు పధకం రచించారు. ప్రతి నెలలాగే ఈ ఏడాది ఆగస్టు 31న జానకయ్యపేట వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ దావరసింగి వెంకటేశ్వరరావు పింఛన్ల సొమ్ము డ్రా చేయడానికి బ్యాంక్‌కు వెళ్లగా, ఆయనతో డివిటల్‌ అసిస్టెంట్‌ నానిబాబు కూడా వెళ్లాడు. బ్యాంకు నుంచి రూ.13,78,500 డ్రా చేసి తీసుకొస్తుండగా, అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల వెళ్లే మార్గ మధ్యలో ముందస్తు ప్రణాళిక ప్రకారం దేవిరెడ్డి సాయి కుమార్‌, చందక సాయి వారిని అడ్డగించి వాహనం నడుపుతున్న వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వరరావు కంట్లో కారం కొట్టారు. అనంతరం ఆయన వద్దవున్న డబ్బు తీసుకుని సాయికుమార్‌, చందక సాయి పరారయ్యారు. దీంతో నక్కపల్లి పోలీస్‌ స్టేషన్లో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాలతో నర్సీపట్నం అడిషనల్‌ ఎస్పీ అదిరాజ్‌ సింగ్‌ రాణా పర్యవేక్షణలో నానిబాబు ఇంస్టాగ్రామ్‌ ఐడి ఆధారంగా నక్కపల్లి సిఐ జి.అప్పన్న, ఎస్‌.రాయవరం, ఎలమంచిలి, కోటవురట్ల పోలీసు సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. కేసును ఛేదించిన పోలీసులు నిందితులు డిజిటల్‌ అసిస్టెంట్‌ నానిబాబు, సాయికుమార్‌, చందక సాయిలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12.92 లక్షలు నగదు, ఒక పల్సర్‌ బైక్‌, 5 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేశారు. ఈ కేసును ఛేదించడంలో సహకరించిన పోలీస్‌ సిబ్బందిని ఎస్‌పి మురళీకృష్ణ అభినందించారు.
చైన్‌ స్నాచింగ్‌ ముద్దాయిల అరెస్టు
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బిళ్ళనందూరు గ్రామానికి చెందిన బొత్స వీరబాబు, అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం ఆశాహబ్పేట గ్రామానికి చెందిన అల్లు నూకరాజు ఒంటరి మహిళలే లక్ష్యంగా నాతవరం, నర్సీపట్నం ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌ నేరాలకు పాల్పడ్డారు. నాతవరం మండలం గన్నవరం గ్రామానికి చెందిన లగుడు రమణమ్మ తన బంగారు గొలుసు తెంపుకుపోయినట్టు నాతవరం పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేసింది. దీనిపై జిల్లా అదనపు ఎస్పీ సత్యనారాయణరావు, నర్సీపట్నం అదనపు ఎస్పీ అదిరాజ్‌ సింగ్‌ రాణా పర్యవేక్షణలో దర్యాప్తు చేసి నమ్మకమైన సమాచారంతో మంగళవారం నాతవరం ఇన్చార్జి ఎస్‌ఐ రామకృష్ణారావు తన సిబ్బందితో తాండవ జంక్షన్‌ వద్ద ముద్దాయిలను అరెస్టు చేశారు. వీరు దొంగలించిన సుమారు 4 లక్షల రూపాయల విలువైన మూడు బంగారు చైన్లు, దొంగిలించడానికి వాడిన వాహనాలను మధ్యవర్తిల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పని చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ మురళీకృష్ణ అభినందించారు.