Sep 13,2023 21:27

సచివాలయం వద్ద గ్రామస్తులతో ఆందోళన
ప్రజాశక్తి - కాళ్ల
కాళ్లలో కొత్త పింఛన్లు పంపిణీలో గ్రామ సర్పంచికి అవమానం జరిగింది. కాళ్లలో 25 కొత్త పింఛన్లు బుధవారం పంపిణీ చేశారు. అయితే గ్రామ సర్పంచి బందా విజయకు ఆహ్వానం అందలేదు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి దళిత సర్పంచిను ఆహ్వానించ కపోవడం, ఎంపిటిసి, వైసిపి నాయకులు పింఛన్లు పంపిణీ చేయడం సరికాదని సర్పంచి బంధా విజయ గ్రామస్తులతో కలిసి ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. గ్రామంలో జరిగిన కార్యక్రమానికి సర్పంచిని పిలవరా అని ప్రశ్నించారు. దళిత సర్పంచి అని పక్కన పెట్టినప్పుడు పింఛన్లు పంపిణీ ప్రజలకు ఎలా చేరుతుందని సర్పంచి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇంఛార్జి గ్రామ కార్యదర్శి పద్మావతి క్షమాపణతో ఆందోళన ముగిసింది. ప్రోటోకాల్‌ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని సర్పంచి విజయ తెలిపారు.