* ఎంపిడిఒ కార్యాలయం తలుపులు మూసివేత
* ధర్నా చేసిన వైసిపి నేతలు
ప్రజాశక్తి - బూర్జ: సామాజిక పింఛను మంజూరైనా లబ్ధిదారునికి పింఛన్ మొత్తం అందజేయకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని బూర్జ గ్రామస్తులు ఎంపిడిఒను నిలదీశారు. మండల కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒకటో తేదీన గ్రామంలో పెన్షన్లు అందజేసినా గ్రామానికి చెందిన బి.రాములుకు పింఛను మొత్తాన్ని అందజేయలేదన్నారు. ఈయనకు ఎనిమిది నెలల కిందట అప్పటి ఎంపిడిఒ సురేష్ కుమార్ పింఛన్ నిలుపుదల చేశారని అన్నారు. పీడీ ఆదేశాల మేరకు మూడు నెలల పింఛన్ మంజూరైందని, అయినా లబ్ధిదారునికి ఎందుకు అందజేయలేదని బూర్జ వైసిపి నాయకుడు తొత్తడ సురేష్, ఎంపిడిఒ రవీంద్రబాబును ప్రశ్నించారు. ఈ క్రమంలో అధికారులతో గ్రామస్తులకు వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో ఎంపిడిఒ కార్యాలయం తలుపులకు గడియ వేశారు. అనంతరం కార్యాలయం బయట వైసిపి నేతలతో పాటు గ్రామస్తులు ధర్నా చేసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ఎంపిడిఒ రవీంద్రబాబు మాట్లాడుతూ లబ్ధిదారునికి పింఛను మొత్తాన్ని అందజేయాలని కార్యదర్శికి చెప్పామన్నారు. జాప్యానికి గల కారణాన్ని తెలుసుకుంటామన్నారు. లబ్ధిదారునికి పింఛను అందజేసేందుకు చర్యలు చేపడతానని హామీనిచ్చారు.










