ప్రజాశక్తి-బాపట్ల: ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లోని వారు విద్యను పరమావధిగా భావించి వారి పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండేలాగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని బాపట్ల జిల్లా ఎస్‌సి, ఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గుదె రాజారావు కోరారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ బాపట్ల జిల్లా రీజనల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు అధ్యక్షతన బాపట్లలోని రాజీవ్ గాంధీ కాలనీలో చెత్త ఏరుకునే కుటుంబాల బాల బాలికల విద్య కోసం విద్యాచైతన్య ప్రచార ఉద్యమ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ప్రచార ఉద్యమంలో భాగంగా కాలనీలో బాపట్ల జిల్లా దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు దారా బాబురావు చేతుల మీదుగా అవుట్ డోర్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కుటుంబా ల్లోని పిల్లలు విద్యాపరంగా ఎదగాలని, డ్రాప్ అవుట్ కాకుండా పిల్లలను గుర్తించి వారు విద్యకు దూరం కాకుండా ప్రత్యేకంగా లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు డిబిఆర్‌సి సంస్థను అభినందించారు. బాపట్ల జిల్లా దళిత గిరిజన బడ్జెట్ వాచ్ చైర్మన్ దేవరపల్లి డేవిడ్‌రాజు మాట్లాడుతూ డిబిఆర్సి లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు అణగారిన పిల్లల విద్య అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నాయన్నారు. డిబిఆర్సి రీజనల్ కో ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ దళిత బహుజన కుటుంబాలలోని పిల్లల విద్య తోడ్పాటుకు ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఈ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ బాపట్ల సిటీ కో ఆర్డినేటర్ కె సరోజిని మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు చదువుకు దూరం అవుతుండగా సంక్షేమానికి ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తున్న వాటిని వినియోగించుకోకుండా చాలామంది చదువుకు దూరం అవుతున్నారని తెలియజేశారు. ఇలాంటి అవుట్ డోర్ లెర్నింగ్ సెంటర్ ద్వారా విద్యా అభివృద్ధిని పెంపొందించుకోవచ్చని అన్నారు. అద్దంకి ఏరియా కో-ఆర్డినేటర్ పులిపాటి వీరయ్య మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలో చేర్పించేలా తల్లిదండ్రులు స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. విద్యార్థినీ విద్యార్థులకు ఆట వస్తువులు, పలకలు, బ్లాక్ బోర్డు పంపిణీ చేశారు.










