చలికాలం శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ఈ మార్పులు పెద్దలపై మాత్రమే కాదు... పిల్లలపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఈ కాలంలో పిల్లలకు సమస్య పొద్దున్నే నిద్రలేవడం దగ్గర్నుంచి మొదలవుతుంది. చలికాలం తీవ్రమైన చలితో పాటు జలుబు, దగ్గులాంటి అనారోగ్యాల్ని కూడా వెంట మోసుకొస్తుంది. పిల్లల విషయంలోనైతే ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. స్వెట్టర్లు, క్యాప్‌లు సరిగ్గా ధరించకపోవడమూ ఇందుకు ఓ కారణం. కాబట్టి ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా పిల్లలకు ఉన్ని దుస్తులు వేయడం మాత్రం మరిచిపోకూడదు.
అసలే తీవ్రమైన చలి అంటే.. .కొందరు వాళ్ళ పిల్లలకు అడిగిన వెంటనే ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్ వంటివి కొనిచ్చేస్తుంటారు. ఇవి తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం చలికాలం అయిపోయేంత వరకైనా పిల్లల్ని వీటి జోలికి పోకుండా చూసుకోవాలి. స్కూలుకు వెళ్ళే పిల్లలకు యూనిఫాంతో పాటు స్వెట్టర్, తలను కప్పి ఉండేలా క్యాప్ లాంటివి కూడా వేసి పంపించాలి.
అలాగే పాదరక్షల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. చలికి పాదాలు పగలకుండా సాక్సులు, బూట్లు లాంటివి వేయాలి. పిల్లలకు సూప్స్, స్నాక్స్, భోజనం...ఇలా అన్నీ ఇంట్లోనే వేడి వేడిగా వండిపెట్టాలి. సాధ్యమైనంత వరకూ బయటి ఆహారం తినకుండా అదుపు చేయాలి.
ఫ్లూ రాకుండా ఉండేందుకు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే క్యారెట్లు, లైకోపిన్ ఉండే టమోటో, క్యాప్సికంలాంటి వాటితో కూరలు లేదా సూప్స్ చేసి పెట్టడం వల్ల వాటిలోని పోషకాలు పిల్లలకు అంది, ఆరోగ్యంగా ఉంటారు.
ఈ సీజన్‌లో వేధించే మరో సమస్య చర్మం పొడి బారడం. చల్లగా వీచే గాలుల వల్ల శరీరంలోని తేమ శాతం తగ్గిపోయి, చర్మం పొడిబారుతుంది. దీనివల్ల చర్మం సున్ని తత్వాన్ని కోల్పోతుంది. అందులోనూ సుకుమారంగా ఉండే పిల్లల చర్మం మీద చలి ప్రభావం మరింత ఎక్కువగానే ఉంటుంది.
ఈ సమస్య నుంచి పిల్లల లేత చర్మాన్ని సంరక్షించు కోవాలంటే రోజూ మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్లీ వంటివి రాయడం మర్చిపోవద్దు. ఈ కాలంలో పిల్లలకు ఉదయం స్నానం చేయించి.. సాయంత్రం కాళ్లు, చేతులు శుభ్రంగా కడగాలి. లేదంటే చర్మంపై పడిన దుమ్మూ ధూళీ అలాగే ఉండిపోయి నిర్జీవంగా మారిపోతుంది.