Aug 21,2023 23:45

మాట్లాడుతున్న పాఠశాల విద్యా కమిషనర్‌ సురేష్‌కుమార్‌


ప్రజాశక్తి-పాడేరు: బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని పాఠశాల విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, కెజిబివి అధికారులు, ఐటిఐ ప్రిన్సిపాల్స్‌ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారం రోజుల్లో పూర్తి స్థాయిలో జె.వి.కె కిట్లు విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండా, విద్యార్థులు పాఠశాలకు రాకపోయినా కొన్ని చోట్ల హాజరు నమోదు చేస్తున్నారని తెలిపారు.మన బడి నాడు, మధ్యాహ్న భోజన పథకం, పాఠ్య ప్రణాళికల అమలుపై మండల విద్యాశాఖాధికారులకు అవగాహన ఉండాలని సూచించారు. విద్యాశాఖాధికారులు అంకితభావంతో పని చేయాలనాన్నారు. విద్యార్థుల హాజరుపై జిల్లా విద్యాశాఖాధికారులు సమీక్షించాలని సూచించారు. ఎం.ఇ.ఓలు, ఎటిడబ్ల్యూఓలు సమన్వయంతో పని చేసి పాఠశాలను సందర్శించి సమీక్షించాలని చెప్పారు. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఎంత మంది కళాశాలలు, ఐటిఐ చేరారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐటిఐ పాసైన విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు. పాఠశాలల్లో బినామీ ఉపాధ్యాయులుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్మీడియేట్‌ ఎడ్యుకేషన్‌ కమీషనర్‌ సౌరభ్‌ గౌర్‌ మాట్లాడుతూ, అంకితభావంతో చదువులు చెప్పాలని సూచించారు. జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 13,227 మంది విద్యార్థులు ఇంటర్‌ విద్యను అభ్యశిస్తున్నారని తెలిపారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను గెస్ట్‌ ఫ్యాకల్టీ విధానంలో భర్తీ చేస్తామని చెప్పారు. 10వ తరగతి. ఉత్తీర్ణులైన విద్యార్థులకు జూనియర్‌ కళాశాలలో ప్రవేశం కల్పించాలని స్పష్టం చేసారు.
జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ 1.66 లక్షల మంది విద్యార్థులకు జెవికె కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 21 వేల మంది విద్యార్థులను కొత్తగా పాఠశాలలో చేర్పించారన్నారు. 10 నుండి 15 వేల జె. వి.కె.కిట్లు అవసరం ఉంటుందన్నారు.అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పందనలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రంపచోడవరం ఐటిడిఏ పి ఓ సూరజ్‌ గనోరి, డిఇ ఓ సలీంభాషా, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జ్యోతి కుమారి, జిల్లాలోని ఎంఇఓలు జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, కెజిబివి అధికారులు తదితరులు పాల్గొన్నారు.