Sep 07,2023 22:58

సమావేశంలో మాట్లాడుతున్న జెసి రాజకుమారి

ప్రజాశక్తి-గుంటూరు : ఐదు నుండి 18 ఏళ్లలోపు పిల్లలందర్నీ విద్యాసంస్థల్లో చేర్పించి నూరు శాతం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కే.ఎస్‌. జవహర్‌రెడ్డికి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌. జవహర్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ వీసీ హాల్‌ నుండి పాల్గొన్న జెసి జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోకు సంబంధించి 560 క్లస్టర్‌ సచివాలయాల్లో ఇప్పటికే 551 క్లస్టర్‌ సచివాలయాల్లో నూరుశాతం నమోదైనట్లు చెప్పారు. మొదటి తరగతి నుండి పదవ తరగతి వరకు డ్రాపౌట్స్‌ లేకుండా ప్రతి ఒక్కర్నీ తిరిగి పాఠాశాలల్లో చేర్పించేలా నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత కాకపోవడం వలన డ్రాప్‌ ఔట్‌ అయిన వారిని తిరిగి కళాశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో డిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ ఎ.శ్రావణ్‌కుమార్‌, డిఇఒ పి.శైలజ, జెడ్పీ సిఇఒ జె.మోహన్‌రావు పాల్గొన్నారు.