* అందుకే 'చిన్నారికి చేదోడు'
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం : వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న పిల్లల్లో భయాన్ని తొలగించి మనోధైర్యాన్ని కల్పించి, వారిలో నేర ప్రవృత్తి భావాన్ని తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక పిలుపునిచ్చారు. అనుభవజ్ఞులైన 60 ఏళ్లు దాటిన పెద్దలు ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలకు బాసటగా నిలవాలన బృహత్కరమైన ఆలోచనతో ఎస్‌పి ప్రతిష్టాత్మకంగా 'చిన్నారికి చేదోడు' కార్యక్రమం ఇదివరకు ప్రవేశపెట్టారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కౌనిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న పిల్లల్లో భయం, ఆత్మహత్య అనే దురాలోచన తొలగించేందుకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల పిల్లలకు కౌన్సెలింగ్ నిమిత్తం రావాలని జిల్లా పోలీస్ శాఖ పిలుపు మేరకు 77 మంది వచ్చారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పలు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వసతిగృహ బాలబాలికలకు సూచనలు అందించి వారి ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చారని కొనియాడారు. మరికొంతమంది ఇందులో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు జడ్జి వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ కార్యక్రమం కోసం వివరించగా చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని తెలిపారన్నారు. ఈసారి వసతిగృహాలకు వెళ్లినప్పుడు ఒక్కో విద్యార్ధితో కలిసి మాట్లాడి కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. పలు కారణాలతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాక జిల్లాలో ఆత్మహత్యలు సంఖ్య తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
ఆదనపు ఎస్‌పిలు టి.పి.విఠలేశ్వర్, జె.తిప్పేస్వామి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి వసతిగృహానికి మానసిక నిపుణులు లేనందున, కౌన్సెలర్ల ద్వారా విద్యార్థులు మనోధైర్యాన్ని పెంపొందించుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సెలర్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం కౌన్సెలర్లను ఎస్‌పి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డిఎస్‌పి వై.శృతి, ఎస్.బాలరాజు, సిఐలు శ్రీనివాసరావు, ఎల్.ఎస్ నాయుడు, ఎస్‌బి సిఐ లక్ష్మణమూర్తి, ఎస్‌ఐలు లక్ష్మణ్, ప్రసాద్, సీనియర్ సిటిజన్లు, సంఘ సేవకులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










