Oct 24,2023 21:45


ప్రజాశక్తి - నగరి
పట్టణ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 8వ జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన ఫైర్‌ క్యాంప్‌ కార్యక్రమంతో మైదానం అంతా ఆనందపు కేరింతలు వినిపించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజనసర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా క్రీడాకారులతో మమేకమై తన విద్యార్థిదశను గుర్తుచేసుకున్నారు. తాను మీతోటి క్రీడాకారిణే అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మంటల చుట్టూ తిరుగుతూ ఆనందంగా నత్యం చేయడం ఈ కార్యక్రమానికి నూతన హంగులను చేకూర్చింది. మంత్రితో కలిసి నత్యం చేసిన విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వాళ్లలో కొత్త జోష్‌ కనిపించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరుసగా క్రీడల్లో పాల్గొని అలసిపోయిన విద్యార్థుల్లో కొత్త జోష్‌ నింపడానికే టోర్నమెంట్లలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ఇది విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. అప్పటివరకు జరిగిన పోటీల్లో గెలుపు, ఓటమి ఆనే తేడాలు మరచి అందరం మంచి స్నేహితులమనే స్నేహ భావాన్ని పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమానంతరం పోటీలను చక్కగా నిర్వహించిన రాష్ట్ర, జిల్లా, నగరి బాల్‌బాడ్మింటన్‌ అసోసియేషన్‌ సభ్యులను ఆమె దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు రామ్‌ప్రసాద్‌ రెడ్డి పాల్గొన్నారు.