ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: పిల్లలకు టీకాలను తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. జిల్లాలో మూడు దశల్లో నిర్వహించనున్న మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జెడ్‌పి సమావేశ మందిరంలో మిషన్ ఇంద్రధనస్సు బ్యానర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొటీన్ ఇమ్యునైజేషన్‌లో టీకాలు తీసుకోని 0-5 ఏళ్ల పిల్లలను గుర్తించి వారికి టీకాలు వేయడమే ఈ మిషన్ లక్ష్యమన్నారు. జిల్లాలో గత నెల 19 నుంచి 24వ తేదీ వరకు గ్రామాల్లో ఆశావర్కర్లు నిర్వహించిన సర్వేలో సుమారు 500 మంది పిల్లలు, 88 మంది గర్భిణులను గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ ఈనెల 7 నుంచి 12, సెప్టెంబర్ 11 నుంచి 16, అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకు మూడు విడతల్లో టీకాలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 732 సచివాలయాలు, గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీకాలు వేస్తామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, డిఇఒ ఆర్.వి.ఎస్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డిఆర్‌ఒ పి.మురళీకృష్ణ, ఉప కలెక్టర్ జయదేవి, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, డిఎస్‌ఒ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.










